టీమిండియా దిగ్గజం, క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర వీడియోను షేర్ చేశారు. ప్లాస్టిక్ వల్ల పర్యవరణానికి ఎంతో హానీ కలుగుతుందని, భవిష్యత్తు తరాల కోసం ప్రకృతిని రక్షించేందుకు బాధ్యతాయుతంగా ఉందామని పిలుపునిచ్చారు.
సచిన్ టెండూల్కర్ షేర్ చేసిన వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఈ వీడియోలో ఓ పులి.. నీటి కొలనులో ఉన్న ప్లాస్టిక్ బాటిల్‌ను తన నోటితో తీసి వేసింది. ఈ వీడియోను మహారాష్ట్ర టూరిజం షేర్ చేయగా.. సచిన్ టెండూల్కర్ రీట్వీట్ చేశారు. 'ఓ టైగర్ ప్లాస్టిక్ బాటిల్ తీసేసి... పర్యావరణాన్ని రక్షించాలని బోధించింది. కాబట్టి పర్యవరణాన్ని రక్షించేందుకు మనవంతుగా బాధ్యత వహిద్దాం'అని సచిన్ క్యాప్షన్‌గా పేర్కొన్నారు.

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మానవ జీవితంలో భాగమైన ప్లాస్టిక్ వల్ల పర్యవరణానికి తీరని నష్టం జరుగుతుంది. ముఖ్యంగా అడవుల్లో జంతువులకు ప్లాస్టిక్ తీవ్ర ఇబ్బందులను కలిగిస్తోంది. మూగ జీవాలు ప్లాస్టిక్‌ను తిని మృత్యువాత పడుతున్నాయి. ప్లాస్టిక్ బాటిళ్లను ఎక్కడ పడితే అక్కడ పడివేయకుండా బాధ్యతాయుతంగా ఉండాలని ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఫలించడం లేదు.
సముద్రాలు, చెరువులు, అడువులు, నదులు అన్నీ ప్లాస్టిక్ వ్యర్థాలతో కలుషితం అవుతున్నాయి. మనుష్యులే బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే తప్పా ఈ విషయంలో పెద్దగా మార్పులు వచ్చే అవకాశం లేదు. కనీసం సచిన్ షేర్ చేసిన వీడియోను చూసైనా.. ప్లాస్టిక్ వినియోగం పట్ల అప్రమత్తంగా ఉంటూ.. పర్యవరణాన్ని కాపాడుదామని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.