
హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తొలిసారి నిర్వహించిన వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)ను న్యూజిలాండ్ జట్టు సొంతం చేసుకుంది. రెండు రోజులు పూర్తిగా వర్షంతో తుడిచి పెట్టుకుపోయినా... 'రిజర్వ్ డే' కారణంగా ఉత్కంఠభరితంగా మారిపోయిన ఫైనల్లో న్యూజిలాండ్ ఎనిమిది వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. ఈ టోర్నీ ఆసాంతం ఆకట్టుకున్న కోహ్లీసేన కీలక ఫైనల్లో మాత్రం తడబడి మూల్యం చెల్లించుకుంది. అయితే ఈ టైటిల్ పోరులో టీమిండియా చేసిన తప్పిదాలను మాజీ క్రికెటర్లు, నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలోనే భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్.. చాంపియన్ అయిన బ్లాక్ క్యాప్స్‌కు కంగ్రాట్స్ చెబుతూనే.. కోహ్లీసేన ఓటమికి గల కారణాన్ని తెలియజేశాడు.
చివరి రోజు ఆటలో 10 బంతుల వ్యవధిలోనే కెప్టెన్ విరాట్ కోహ్లీ, చతేశ్వర్ పుజారాల వికెట్లను కోల్పోవడం భారత ఓటమికి కారణమైందని సచిన్ టెండూల్కర్ ట్విటర్ వేదికగా అభిప్రాయపడ్డాడు. ఈ ఇద్దరు బాధ్యతాయుతంగా ఆడి ఉంటే డ్రాతోనైనా గట్టెక్కదని తెలిపాడు. 'డబ్ల్యూటీసీ టైటిల్ గెలిచిన న్యూజిలాండ్‌కు అభినందనలు. మీదో అద్భుతమైన జట్టు. భారత జట్టు తమ పేలవ ఆటతీరుతో తీవ్రంగా నిరాశపరిచింది. చివరి రోజు తొలి 10 ఓవర్లు చాలా కీలకమని నేను ముందే చెప్పాను. కానీ భారత్ 10 బంతుల వ్యవధిలోనే విరాట్ కోహ్లీ, చతేశ్వర్ పుజారాల వికెట్లు కోల్పోయింది. దాంతో భారత జట్టు తీవ్ర ఒత్తిడికి గురైంది.'అని సచిన్ ట్వీట్ చేశాడు. అయితే చివరి రోజు ఆటకు ముందే భారత ఆటగాళ్లను హెచ్చరిస్తూ సచిన్ ట్వీట్ చేశాడు. మ్యాచ్ భవితవ్యాన్ని తేల్చేందుకు మొదటి పది ఓవర్లు కీలకమని తెలిపాడు. తొలి సెషన్ ఆధారంగా మ్యాచ్ ఎటు వెళ్తుందో నిర్ణయించవచ్చు పేర్కొన్నాడు.
ఓవర్‌నైట్ స్కోరు 64/2తో రిజర్వ్ డే అయిన బుధవారం ఆట కొనసాగించిన భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 170 పరుగులకే ఆలౌటైంది. రిషభ్ పంత్ (88 బంతుల్లో 4 ఫోర్లతో 41) టాప్ స్కోరర్‌గా నిలవగా, సౌతీ 4 వికెట్లతో దెబ్బ తీశాడు. అనంతరం మిగిలిన 53 కనీస ఓవర్లలో 139 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 45.5 ఓవర్లలో 2 వికెట్లకు 140 పరుగులు చేసింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (89 బంతుల్లో 8 ఫోర్లతో 52 నాటౌట్), రాస్ టేలర్ (100 బంతుల్లో 6 ఫోర్లతో 47 నాటౌట్) మూడో వికెట్‌కు 96 పరుగుల అభేద్య భాగస్వామ్యంతో జట్టును గెలిపించారు. మ్యాచ్‌లో 7 వికెట్లు తీసిన జేమీసన్ 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్'గా నిలిచాడు.