భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు అరుదైన గౌరవం దక్కింది. క్రికెట్ మక్కాగా పరిగణించే ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో సచిన్ టెండూల్కర్ ఐదు నిమిషాల పాటు గంట మోగించాడు. లార్డ్స్ మైదానంలో సచిన్ గంట మోగించడం ఇదే తొలిసారి. ఐదు టెస్ట్‌ల అండర్సన్-సచిన్ ట్రోఫీలో భాగంగా లార్డ్స్ వేదికగా గురువారం భారత్, ఇంగ్లండ్ మధ్య మూడో టెస్ట్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌ను సచిన్ గంట మోగించి ప్రారంభించాడు. 2007 నుంచి లార్డ్స్ మైదానంలో ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ప్రతీ టెస్ట్ మ్యాచ్ ప్రారంభానికి ముందు ముఖ్యమైన వ్యక్తులతో గంటను మోగిస్తున్నారు. లార్డ్స్‌లో సెంచరీ చేయడంతో పాటు ఐదు వికెట్ల ఘనతను అందుకున్న మాజీ ఆటగాళ్లతో గౌరవ సూచకంగా బెల్ మోగిస్తున్నారు.
గతంలో భారత్ నుంచి సునీల్ గవాస్కర్, రాహుల్ ద్రవిడ్, కపిల్ దేవ్ వంటి దిగ్గజ ఆటగాళ్లు ఈ బెల్‌ను మోగించారు. సచిన్ టెండూల్కర్ లార్డ్స్‌లో టెస్ట్ సెంచరీ చేయనప్పటికీ, క్రికెట్‌లో అతని గొప్ప ప్రదర్శన, వారసత్వానికి గౌరవ సూచకంగా మెరలిన్ క్రికెట్ క్లబ్(ఎంసీసీ) బెల్ మోగించి సత్కరించింది. భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న సిరీస్‌కు కూడా సచిన్-అండర్సన్ అని పేరు పెట్టిన విషయం తెలిసిందే. ఎంసీసీ మ్యూజియంలో సచిన్ టెండూల్కర్ చిత్రపటాన్ని కూడా ఆవిష్కరించారు.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో శుభ్‌మన్ గిల్ టాస్ ఓడిపోయాడు. టాస్ గెలిస్తే బౌలింగ్ ఎంచుకునేవాళ్లమని గిల్ తెలిపాడు. 'వాస్తవానికి ఈ ఉదయం నేను కాస్త గందరగోళానికి గురయ్యాను. టాస్ గెలిస్తే ఏం తీసుకోవాలో అర్థం కాలేదు. అయితే నేను ముందుగా బౌలింగ్ ఎంచుకునేవాడిని. తొలి సెషన్‌లో పిచ్ నుంచి బౌలర్లకు సహకారం ఉంటుంది. గత మ్యాచ్‌లో అందరూ రాణించారు. బౌలర్లు రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. ఎడ్జ్‌బాస్టన్ వికెట్‌పై 20 వికెట్లు తీయడం సులువైన పనికాదు. మేం ఒకే ఒక్క మార్పుతో బరిలోకి దిగుతున్నాం. ప్రసిధ్ కృష్ణ స్థానంలో జస్‌ప్రీత్ బుమ్రా తుది జట్టులోకి వచ్చాడు.'అని శుభ్‌మన్ గిల్ చెప్పుకొచ్చాడు. బుమ్రా కోసం ప్రసిధ్‌ను తుది జట్టులో నుంచి తప్పించాల్సి వచ్చిందన్నాడు.