నచ్చిన అమ్మాయి ప్రేమ పొందడం ఎంత కష్టమో.. ఇంట్లో వాళ్లను ఒప్పించడం అంతకంటే కష్టం. ఈ విషయంలోనే చాలా జంటలు తప్పు చేస్తుంటాయి. తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకునే ధైర్యం లేక ఎదురించి ఒక్కటవుతాయి. మరికొందరు మాత్రం తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకుంటారు. టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు కూడా ఈ కష్టాలు తప్పలేదు.
సచిన్ టెండూల్కర్ తన సతీమణి అంజలిని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆమెతో మాట్లాడటానికి కూడా సచిన్ ఎన్నో కష్టాలు పడ్డాడు. మొబైల్ ఫోన్లు లేని ఆ కాలంలో అంజలితో సచిన్ ల్యాండ్ లైన్‌లో మాట్లాడేవాడు. ఆమెను తన ఇంటికి తీసుకొచ్చేందుకు సచిన్ పెద్ద డ్రామానే ఆడాడు. వార్త విలేకరి అని అబద్దం చెప్పి మరి ఇంటికి తీసుకొచ్చాడు. ఈ విషయాన్ని సచినే తన ఆటో బయోగ్రఫీ ప్లేయింగ్ ఇట్ మై వేలో పేర్కొన్నాడు.

'నా ఇంటర్వ్యూ కావాలని కోరుతూ అంజలి మా ఇంటికి వచ్చేలా ప్లాన్ చేశాం. అదే తొలిసారి మా ఇంట్లో అంజలిని కలిసింది. ఆమె పాత్రికేయురాలి అవతారమెత్తడం అదే తొలిసారి. చివరిసారి కూడా. అప్పటి వరకు ఏ మహిళా విలేకరి కూడా మా ఇంటికి రాలేదు. దాంతో మా వదినకు అనుమానం వచ్చింది. తొలిసారి మా ఇంటికి వచ్చిన అంజలికి ఏదైనా ఇవ్వాలని అనుకున్నాను. ఇంగ్లండ్ నుంచి తెచ్చిన చాక్లెట్స్ ఇచ్చాను. మా తొలి సమావేశం చాలా త్వరగా ముగిసింది. కానీ ఈ సమావేశం మధుర జ్ఞాపకంగా మిగిలిపోయింది.
ఈ సమావేశం తర్వాతే మా మధ్య చనువు పెరిగింది. మేం ఫోన్‌లో చాలా సేపు ఎక్కువగా మాట్లాడుకునేవాళ్లం. కానీ మేం మళ్లీ కలుసుకునే అవకాశం ఎప్పుడూ రాలేదు. కలుసుకోవాలని ప్రయత్నించ కుదరలేదు. అంజలి వాళ్ల మారుతి 800 కారులో రెండోసారి కలుసుకున్నాం. మెరైన్ డైవ్‌లో కొబ్బరి బోండా తాగాలని ఉందని చెప్పింది. మా జీవితాల్లో ఒకే ఒక్కసారి ఎయిర్ ఇండియా భవంతి ఎదురుగా బల్ల మీద కూర్చుని కొబ్బరి నీళ్లు తాగాం. ప్రజలు నన్ను గుర్తు పడుతారని తెలిసి కూడా ఆమె కోసం నేను ఈ సాహసం చేశాను.'అని సచిన్ టెండూల్కర్ తన బుక్‌లో రాసుకొచ్చాడు.
ఓ ఇంటర్వ్యూలో అంజలి కూడా ఈ సంఘటనను గుర్తు చేసుకుంది. మోడర్న్ దుస్తులు ధరించే తాను సచిన్ టెండూల్కర్ కోసం తొలిసారి సల్వార్ కమీజ్ ధరించి ఆయన ఇంటికి వెళ్లానని తెలిపింది. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న సచిన్ టెండూల్కర్-అంజలి.. సారా టెండూల్కర్, అర్జున్ టెండూల్కర్‌కు జన్మనిచ్చారు. అతి త్వరలోనే సచిన్ దంపతులు అత్త, మామ కాబోతున్నారు.
అర్జున్ టెండూల్కర్ వివాహంమార్చి 5న జరగనున్నట్లు వార్తలు వచ్చాయి. సచిన్ తరహాలోనే అర్జున్ టెండూల్కర్ పెద్దలను ఒప్పించి పెళ్లికి సిద్దమయ్యాడు. తన ప్రియురాలు, వ్యాపారవేత్త రవి ఘాయ్ మనవరాలైన సానియా చందోక్‌ను అర్జున్ పెళ్లి చేసుకోబోతున్నాడు. తన అక్క ఫ్రెండ్ అయిన సానియా చందోక్‌తో అర్జున్ టెండూల్కర్ సీక్రెట్‌గా లవ్ ఎఫైర్ నడిపాడు. ఈ విషయం తెలిసి సారా టెండూల్కర్‌తో పాటు సచిన్ కుటుంబం మొత్తం అవాక్కైందంట.