ఏఐ టెక్నాలజీతో రూపొందిస్తున్న డీప్ ఫేక్ వీడియోలు సెలెబ్రిటీలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఆ మధ్య సౌతిండియా హీరోయిన్ రష్మీక మంధానకు సంబంధించిన డీప్ ఫేక్ వీడియో తీవ్ర చర్చనీయాంశమైంది. అశ్లీలంగా ఉన్న ఓ వీడియోకు ఆమె ముఖ చిత్రంతో చేసిన డీప్ ఫేక్ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ వీడియోపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. రష్మీకతో పాటు చాలా మంది సెలెబ్రీటీలు ఈ డీఫ్ ఫేక్ వీడియోల బారిన పడ్డారు. తాజాగా ఈ జాబితాలో క్రికెట్ గాడ్, భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా చేరాడు. ఓ గేమింగ్ యాప్‌నకు సచిన్ ప్రచారం చేస్తున్నట్లు దుండగులు డీప్ ఫేక్ వీడియోను సృష్టించి వైరల్ చేశారు.

ఈ వీడియోను చూసి ఖంగుతిన్న సచిన్ టెండూల్కర్ సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ వీడియోలో ఉన్నది తాను కాదని క్లారిటీ ఇచ్చారు. ఈ వీడియోపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
'ఈ వీడియోలు ఫేక్. టెక్నాలజీని ఇలా విచ్చలవిడిగా దుర్వినియోగం చేయడం ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి వీడియోలు, యాడ్స్, యాప్‌లు ఎక్కడ కనిపించినా వెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయండి. సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ అలర్ట్‌గా ఉంటూ ఈ డీప్ ఫేక్ వీడియోల ఫిర్యాదులపై వెంటనే స్పందించాలి.
ఫేక్ ప్రచారాలతో పాటు డీప్ ఫేక్ వీడియోలు వైరల్ కాకుండా చర్యలు తీసుకోవాలి.'అని సచిన్ ఎక్స్ వేదికగా రాసుకొచ్చాడు. ఈ పోస్ట్‌ను కేంద్ర ఐటీ శాఖ మంత్రి, మహారాష్ట్ర సైబర్ టీమ్‌కు ట్యాగ్ చేశారు. సచిన్‌పై రూపొందించిన ఈ డీప్ ఫేక్ వీడియోలో..స్కైవార్డ్ ఏవియేటర్ క్వెస్ట్ పేరుతో ఉన్న గేమింగ్ యాప్‌నకు మాస్టర్ బ్లాస్టర్ ప్రచారం చేస్తున్నట్లుగా ఉంది.
ఈ యాప్‌తో డబ్బులు ఎలా సంపాదించవచ్చో ఆయన వివరిస్తున్నట్లుగా డీప్ ఫేక్ టెక్నాలజీ సాయంతో వీడియోను మార్ఫింగ్ చేశారు. ఆ మధ్య సచిన్ కూతురు సారా టెండూల్కర్ కూడా డీప్ ఫేక్ బారిన పడ్డారు. టీమిండియా క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌తో సారా ఉన్నట్లు మార్ఫింగ్ ఫొటో నెట్టింట వైరల్ అయ్యింది.
సారా-అర్జున్ టెండూల్కర్ ఫొటోను మార్ఫింగ్ చేశారు. అర్జున్ స్థానంలో శుభ్‌మన్ గిల్ ఉన్నట్లు ఎడిట్ చేసి వైరల్ చేశారు. అప్పట్లో ఈ ఫొటోపై సారా టెండూల్కర్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తన పేరిట చాలా నకిలీ ఖాతాలు ఉన్నాయని, వాటిని తొలగించాలని కూడా సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌కు సూచించారు.