టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాపై భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రశంసల జల్లు కురిపించాడు. బుమ్రా.. ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెటర్ అని కొనియాడాడు. ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా పేలవ ప్రదర్శన కనబర్చిన విషయం తెలిసిందే.
పెర్త్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో భారీ విజయంతో ఈ సిరీస్‌ను ఘనంగా ప్రారంభించిన భారత్.. ఆ తర్వాతి నాలుగు మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమైంది. ఒక మ్యాచ్‌ను వర్షం సాయంతో డ్రా చేసుకొని మరో మూడు మ్యాచ్‌ల్లో ఓడింది. దాంతో 10 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆసీస్ 3-1 తేడాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని గెలుచుకుంది. ఈ విజయంతో ఆసీస్ డబ్ల్యూటీసీ 2025 ఫైనల్ బెర్త్ దక్కించుకోగా.. టీమిండియా ఆశలు గల్లంతయ్యాయి. జూన్ లార్డ్స్ వేదికగా జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆసీస్, సౌతాఫ్రికా తలపడనున్నాయి.

ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని టీమిండియా కోల్పోయినా..స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా అసాధారణ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 9 ఇన్నింగ్స్‌ల్లో 13.06 సగటుతో 32 వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రదర్శనతో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డ్ గెలుచుకున్నాడు. ఆసీస్ జట్టులోని 15 మంది ఆటగాళ్లను తన బౌలింగ్‌తో వణికించాడు. ఈ విషయాన్ని ఆసీస్ ఆటగాళ్లే చెప్పారు. ఈ సిరీస్‌లో బుమ్రా తమకు సింహస్వప్నంలా మారడని కొనియాడాడు. ఈ సిరీస్‌లో అతను కనబర్చిన ప్రదర్శన తమ జీవితంలోనే చూడలేదని కితాబిచ్చారు.
టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సైతం బుమ్రాపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురిపించాడు. విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా జట్టును కొనియాడుతూనే.. బుమ్రా వరల్డ్ బెస్ట్ క్రికెటర్ అని పేర్కొన్నాడు.
Commendable performance by Australia to come back from 0-1 down and win the series 3-1. Congratulations to them for winning the Border Gavaskar Trophy.
— Sachin Tendulkar (@sachin_rt) January 5, 2025
Special mention to @Jaspritbumrah93.
“Jas” is just the best in the world!#AUSvIND pic.twitter.com/K2pSQZOkVQ
'ఈ సిరీస్‌లో 0-1తో వెనుకంజలో నిలిచిన తర్వాత పుంజుకొని 3-1తో విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా ప్రదర్శన ప్రశంసనీయం. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని గెలుచుకున్నందుకు వారికి అభినందనలు. ఇక్కడ మనం జస్‌ప్రీత్ బుమ్రా గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఈ ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడు అతను.'అని సచిన్ ట్వీట్ చేశాడు.