Sachin...రైతుల గురించి నీకు ఏం తెలుసు? రైతుల కోసం కాకుండా.. ప్రభుత్వం కోసం బ్యాటింగ్ చేస్తున్నావ్!

హైదరాబాద్: కేంద్రానికి వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తోన్న ఉద్యమానికి అంతర్జాతీయ సెలబ్రిటీలు మద్దతు తెలుపుతోన్న సంగతి తెలిసిందే. హాలీవుడ్ పాప్ స్టార్ రిహన్నా, పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ మేనకోడలు మీనా హారిస్‌లు రైతులకు మద్దతుగా ట్వీట్ చేశారు. అయితే అంతర్జాతీయ ప్రముఖులు రైతు ఉద్యమానికి మద్దతు తెలపడంతో.. బీజేపీ మద్దతుదారులతో పాటు మన దేశ క్రీడా, సినీ ప్రముఖులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ జాబితాలో భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూడా ఉన్నాడు.
బయటి వ్యక్తులు కేవలం ప్రేక్షకులు మాత్రమే:
'భారతదేశ సార్వభౌమత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడదు. బయటి వ్యక్తులు (బాహ్య శక్తులు) కేవలం ప్రేక్షకులు మాత్రమే. ఇక్కడి వ్యవహారాల్లో వారు భాగస్వాములు కాలేరు. భారత్ ఏంటో భారతీయులకు తెలుసు. భారతీయులు మాత్రమే భారత్‌కు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాలి' అని సచిన్ టెండూల్కర్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు #Indiatogether #IndiaAgainstPropaganda అనే హాష్ ట్యాగ్స్‌ను ట్యాగ్ చేశారు. ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అయింది. ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది. సచిన్ ట్వీట్‌పై భారత అభిమానులు, నెటిజన్లు విపరీతంగా మండిపడుతున్నారు.
కార్పొరేట్ యజమానుల కోసం పోరాడుతున్నావ్:
సోషల్ మీడియా వేదికగా సచిన్ టెండూల్కర్‌పై విమర్శల వర్షం కురుస్తోంది. 'భారత్ గురించి భారతీయులకు తెలుసు. అప్పుడు రైతుల నిరసనల గురించి మీరు ఏమనుకుంటున్నారో మాకు చెప్పండి?' అని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌లో సచిన్ తన కోసం బ్యాటింగ్ చేసినట్లు నేను కొన్నిసార్లు భావించాను. అది ఈ రోజు నిజం అయింది' అని మరో నెటిజన్ ట్వీటారు. 'భారత రైతులు vs భారత ప్రభుత్వం మ్యాచ్ ఆడితే.. సచిన్ ప్రభుత్వం కోసం బ్యాటింగ్ చేస్తాడు అని మరొకరు మండిపడ్డారు. 'భారతీయ ప్రజల కోసం రైతులు పోరాడుతున్నారు, కార్పొరేట్ యజమానుల కోసం సచిన్ పోరాడుతున్నాడు', 'సచిన్.. రైతుల గురించి నీకు ఏం తెలుసు?. నువ్ ఏం మాట్లాడుతన్నావ్', ' రైతులు నాటిన చెట్లతోనే నువ్ ఆడే బ్యాట్ తయారు చేస్తారు, ఆ విషయం నీకు తెలుసా?' అని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
కోహ్లీ.. నువ్వు మా కెప్టెన్ కాదు:
'రైతు ఉద్యమంపై భిన్నాభిప్రాయలు ఉన్నప్పటికీ అందరం ఐకమత్యంగా ఉందాం. రైతులు మన దేశంలో అంతర్భాగం. వారు దేశానికి వెన్నెముక. ఈ సమస్యకు తప్పక పరిష్కారం లభిస్తుందని నేను అనుకుంటున్నాను. దేశంలో శాంతి నెలకొల్పేందుకు అన్ని పార్టీలు కృషి చేస్తాయని ఆశిస్తున్నా' అని విరాట్ కోహ్లీ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. #IndiaTogether అనే హాష్ టాగ్ కూడా విరాట్ పోస్ట్ చేశాడు. ఈ ట్వీట్‌పై కూడా నెటిజన్లు విపరీతంగా మండిపడుతున్నారు. 'నువ్వు మా కెప్టెన్ కాదు.. హిట్ మ్యాన్, 'రెండు పడవల ప్రయాణం మంచిది కాదు', 'రైతుల గురించి నీకు ఏం తెలుసని మాట్లాడుతున్నావ్.. నీకంటే రిహన్నా ఎంతో నయం' అంటూ నెటిజనులు ట్రోల్ చేస్తున్నారు.
మనమెందుకు దీని గురించి మాట్లాడటం లేదు:
రైతుల ఉద్యమంపై సీఎన్‌ఎన్ ప్రచురించిన కథనాన్ని జోడించి.. 'మనమెందుకు దీని గురించి మాట్లాడటం లేదు?' అంటూ రిహన్నా ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ట్వీట్ మంగళవారం ట్విటర్‌లో ట్రెండింగ్‌గా నిలచింది. దీనిని ఉద్దేశించే సచిన్ ట్వీట్ చేసి అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. రిహన్నా చేసిన ట్వీట్‌పై మాజీ క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజా మండిపడ్డాడు. మా అంతర్గత వ్యవహారాల్లో ఇతరుల జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని అన్నాడు. ఇక ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కూడా తీవ్రంగా విరుచుకుపడ్డారు.
రైతులు మన దేశంలో అంతర్భాగం.. శాంతి నెలకొల్పేందుకు అన్ని పార్టీలు కృషి చేయాలి: కోహ్లీ
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications