
ముంబై: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మరోమారు తన ఉదారతను చాటుకున్నాడు. అస్సాం రాష్ట్రం కరీంగంజ్ జిల్లాలోని మకుందా హాస్పిటల్‌కు వైద్య పరికరాలను అందజేశాడు. దీని ద్వారా దాదాపు రెండు వేల మందికి పైగా పేద చిన్నారులకు మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి. ప్రస్తుతం యునిసెఫ్ గుడ్‌విల్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సచిన్.. పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్, నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో అవసరమైన పరికరాలను విరాళంగా అందజేశాడు.
ఇక సచిన్ సాయానికి మకుందా హాస్పిటల్ పిల్లల వైద్యుడు విజయ్ ఆనంద్ కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే సచిన్ తన ఫౌండేషన్ ద్వారా మధ్యప్రదేశ్‌లోని గిరిజన జాతికి చెందిన కుటుంబాలకు న్యూట్రిషన్ ఆహారంతో పాటు విద్యను అందిస్తున్నాడు. ఈశాన్య రాష్ట్రాల్లోనూ నిరాదరణకు గురైన జాతులను ఆదుకునేందుకు మాస్టర్ ముందుకొచ్చాడు. కరోనా సమయంలో కూడా సచిన్ తనకు తోచిన సాయం చేసి పెద్ద మనసు చాటుకున్న విషయం తెలిసిందే.