టీచర్స్ డే గిఫ్ట్.. తండ్రి పేరిట సచిన్ టెండూల్కర్ కీలక ప్రకటన!
టీచర్స్ డే సందర్భంగా తన తండ్రి ప్రొఫెసర్ రమేశ్ టెండూల్కర్ పేరిట క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కీలక ప్రకటన చేశారు. తన తండ్రి పేరిట ఫేలోషిప్‌ను అందజేయనున్నట్లు వెల్లడించారు. ప్రతీ ఏడాది డాక్టర్ ఆఫ్ మెడిసిన్(ఎండీ) చదివే ఒక విద్యార్థికి ఈ ఫెలోషిప్ ద్వారా ఆర్థిక సాయం అందించనున్నారు.
యువ డాక్టర్లను ప్రోత్సహించేందుకు సచిన్ టెండూల్కర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇంగా హెల్త్ ఫౌండేషన్‌తో కలిసి సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్ ఈ ఫెలోషిప్‌ను అందివ్వనుంది. శ్రీనగర్‌లోని క్లెఫ్ట్, క్రానియో ఫేషియల్ కేర్‌లో ప్రత్యేక శిక్షణ కోసం ప్రతీ ఏడాది ఎండీ చేసే ఒకర్ని ఎంపిక చేయనున్నారు.
టీచర్ అంటే.. మా నాన్న గుర్తొస్తారు..
ఈ విషయాన్ని సచిన్ టెండూల్కర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. టీచర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఎక్స్ వేదికగా సుదీర్ఘ పోస్ట్‌ను పంచుకున్నారు. 'నా ప్రయాణాన్ని తీర్చిదిద్దిన వ్యక్తుల గురించి ఆలోచించినప్పుడు.. నాకు ముందుగా గుర్తొచ్చేది మా ఇల్లే. నా గురించి ఎవరికి తెలియకముందే.. నా క్రికెట్ పిచ్చిని మా నాన్న గుర్తించారు. ఆ ఆట నాకు ఎంత ముఖ్యమో కూడా అర్థం చేసుకున్నారు. ఈ ప్రయాణం నన్ను ఎక్కడికి తీసుకెళ్తుందో అప్పట్లో ఆయనకు తెలియదు. కానీ నాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు.

మా నాన్న రమేష్ టెండూల్కర్ ఒక రచయిత, కవి, ప్రొఫెసర్. అంతేకాదు, నాతో పాటు ఎంతోమందికి ఆయన ఒక మంచి మార్గదర్శి. క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకునే స్వేచ్ఛను ఇస్తూనే.. క్యారెక్టర్‌ను వదులుకుని సాధించే విజయం దండగ అని ఎప్పుడూ గుర్తుచేసేవారు. చిన్నతనంలో నాన్న నాతో చెప్పిన కొన్ని మాటలు నా జీవితాంతం నాలోనే ఉండిపోయాయి. 'ఓడిపోయినా సరే కానీ మోసం చేయకూడదు. ఎప్పుడూ షార్ట్‌కట్లు వెతుక్కోకూడదు.'అని చెప్పేవారు.
అందుకే ఫౌండేషన్ ప్రారంభించాం..
ఒక మంచి గురువు మనలోని ప్రతిభను మనం గుర్తించేకంటే ముందే వారు గుర్తిస్తారు. భారత్‌లో యువ ప్రతిభకు కొదవలేదు. ఒక చిన్నారి బ్యాట్ పట్టినా.. బాల్ పట్టినా.. పుస్తకం చదివినా లేదా మరేదైనా రంగంలో తన ప్రతిభను చూపించినా.. అది వారి ప్రత్యేకత. ప్రతీభ ఉన్నా వారిని గుర్తించే మంచి మార్గదర్శకులు, అవకాశాలు లేకపోవడమే అసలు సమస్య.
నేను, అంజలి కలిసి ఫౌండేషన్ ప్రారంభించడానికి ప్రధాన కారణం ఇదే. భారత్ అంతటా ఎంతో ప్రతిభ ఉన్న పిల్లలు ఉన్నారు. కానీ సరైన కోచ్, మార్గదర్శి, చదువుకునే వాతావరణం, కనీస వైద్య సదుపాయాలు లేకపోవడం వల్ల వాళ్లు తమ ప్రతిభను బయటకు తీయలేకపోతున్నారు. పిల్లలందరికీ క్రీడలు, వైద్యం, విద్య సమానంగా అందాలనేది మా ఆశయం.
ప్రతీ ఏడాది ఓ ఎండీ డాక్టర్‌కు..
మా నాన్న తన జీవితాన్ని ఒక ఉపాధ్యాయుడిగానే గడిపారు. ఒక వ్యక్తికి ఆత్మవిశ్వాసం ఇచ్చి, తమలోని ప్రతిభను గుర్తించేలా చేయడమే ఆయన నాకు నేర్పిన అతిపెద్ద పాఠం. ఈ ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా, నాలోని ప్రతిభను మొదటగా గుర్తించి, నేను సాధించగలనని నమ్మిన ఆ మొదటి గురువును గౌరవించుకుంటున్నాం.
మా దీర్ఘకాలిక హెల్త్‌కేర్ భాగస్వామి 'ఇంగా హెల్త్ ఫౌండేషన్'తో కలిసి "ప్రొఫెసర్ రమేష్ టెండూల్కర్ మెమోరియల్ ఫెలోషిప్"ను ప్రారంభిస్తున్నాం. ప్రతీ ఏడా ఓ ఎండీ డాక్టర్‌కు ఆర్థిక సాయం అందిస్తాం. అత్యవసర వైద్య సంరక్షణలో ఉన్న ఆరోగ్య నిపుణులకు మద్దతు ఇవ్వడం, అలాగే యువ డాక్టర్లను వారి చదువులో ప్రోత్సహించడం కోసం మేం ఈ నిర్ణయం తీసుకున్నాం.
ఉపాధ్యాయుని పాఠాలు ఒక విద్యార్థితో ప్రారంభం కావచ్చు. కానీ వారి ప్రభావం ఎందరో జీవితాలకు ఎన్నో తరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. ఉపాధ్యాయుల దినోత్సవ శుభాకాంక్షలు!'అని సచిన్ టెండూల్కర్ తన పోస్ట్‌లో పేర్కొన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


