
ముంబై: భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ రిటైర్మెంట్ ప్రకటించి నేటి (జూన్ 10, బుధవారం) సరిగ్గా ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా యువీ రికార్డుల్ని, అతను అందించిన చిరస్మరణీ విజయాలను అభిమానులు సోషల్ మీడియా వేదికగా గుర్తు చేసుకున్నారు. దీంతో ఈరోజు ట్విట్టర్‌లో #MissYouYuvi కీవర్డ్ ట్రెండ్‌గా మారింది.
అభిమానుల తరహాలో దిగ్గజ క్రికెటర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సైతం యువరాజ్ సింగ్ క్రికెట్ స్కిల్స్‌ను నెమరువేసుకున్నాడు 'యువరాజ్ రిటైర్మెంట్ ప్రకటించి ఏడాది పూర్తయింది. చెన్నై క్యాంప్‌లో అతడ్ని నేను తొలిసారి చూసినట్లు గుర్తు. పాయింట్ పొజిషన్‌లో యువీ అద్భుతంగా ఫీల్డింగ్ చేస్తుండటాన్ని నేను గమనించా. ఇక యువరాజ్ సింగ్ సిక్స్ కొట్టే సామర్థ్యం గురించి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్రపంచంలోని ఏ క్రికెట్ గ్రౌండ్‌లోనైనా యువీ సిక్స్ కొట్టగలడని నిరూపితమైంది'' అని సచిన్ వెల్లడించాడు.
2000లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన యువరాజ్ సింగ్.. బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ అద్భుతంగా రాణించాడు. ముఖ్యంగా.. పాయింట్ దిశగా దూసుకొచ్చే బంతుల్ని చక్కగా ఒడిసిపట్టుకున్న యువీ.. డైవ్ చేస్తూ ఒంటిచేత్తో ఎన్నో క్యాచ్‌లను అందుకున్నాడు. 2019, జూన్ 9న క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకీ యువరాజ్ సింగ్ రిటైర్మెంట్ ప్రకటించాడు.
యువీ మొత్తం భారత్ తరఫున 40 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 1900 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 304 వన్డే మ్యాచ్‌ల్లో 8701 పరుగులు చేశాడు. 14 సెంచరీలు, 52 హాఫ్ సెంచరీలు చేసాడు. ఇక 58 టీ20 మ్యాచ్‌లు ఆడిన యువీ.. 1177 పరుగులు చేశాడు. 8 ఆఫ్ సెంచరీలు నమోదు చేశాడు.