
న్యూఢిల్లీ: మూడు ఫార్మాట్లలో సారథిగా జట్టును నడిపించేందుకు విరాట్ కోహ్లీ సౌకర్యంగా ఉన్నాడా? లేక ఏదైన ఒత్తిడికి లోనవుతున్నాడా? అనే విషయాన్ని సెలెక్టర్లు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని టీమిండియా మాజీ క్రికెటర్ సబా కరీం అన్నాడు. కోహ్లీకి ఎలాంటి ఇబ్బంది లేకుంటే అతని కెప్టెన్సీ చుట్టూ ప్రస్తుతం జరుగుతున్న చర్చంతా అనవసరమని పేర్కొన్నాడు.
విరాట్ కోహ్లీ గైర్హాజరీలో తాత్కలిక సారథిగా అజింక్యా రహానే చారిత్రాత్మక విజయాన్నందించడంతో అతన్నే కెప్టెన్‌గా కొనసాగించాలనే డిమాండ్ వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో స్పోర్ట్స్ కీదాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనిపై స్పందించిన సబా కరీం ఈ వాదనను కొట్టిపారేశాడు. అయితే భవిష్యత్తు మెగాటోర్నీలు దృష్ట్యా సెలెక్టర్లు కోహ్లీతో మాట్లాడాలని సూచించాడు.
'నిజాయితీగా చెబుతున్నా నా దృష్టిలో ఈ చర్చంతా అనవసరం. జట్టును సమర్థవంతంగా నడిపించే ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు ఉండటం భారత జట్టు అదృష్టం. కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్‌గా అజింక్యా రహానే అద్భుతంగా రాణిస్తున్నారు. పైగా ఈ ఇద్దరివి భిన్నమనస్తతత్వాలు కావడం మరి మంచిది. ఒకరిది దూకుడైన నాయకత్వం అయితే మరొకరిది చాలా ప్రశాంతమైన శైలి. కానీ ఫలితం మాత్రం ఒక్కటే. ఈ ఇద్దరికి పరిస్థితులను ఎలా సమన్వయం చేయాలో, సహచర ఆటగాళ్లను ఎలా స్పూర్తిని రగిల్చాలో తెలుసు.
అయితే గత కొన్నేళ్లుగా మూడు ఫార్మాట్లలో జట్టును నడిపిస్తున్న విరాట్ కోహ్లీతో సెలెక్టర్లు మాట్లాడాలనేది నా అభిప్రాయం. మూడు ఫార్మాట్లలో జట్టును నడిపించేందుకు అతను సుగుమంగా ఉన్నాడా? లేదా తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ ఏడాది భారత జట్టు టీ20 ప్రపంచకప్, తరువాత వన్డే వరల్డ్ కప్ ఆడనుంది. అలాగే వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఆడుతుంది. అతనికిచ్చి కెప్టెన్సీ బాధ్యతల పట్ల సంతోషంగా ఉన్నాడా? అని సెలెక్టర్లు కోహ్లీతో చర్చిస్తే.. టీమ్‌మేనేజ్‌మెంట్, అజింక్యా రహానే అతనిపై ఉన్న ఒత్తిడిని తగ్గించడానికి సరైన పరిష్కారంతో ముందుకు వస్తారు.'అని సబా కరీం తెలిపాడు.
ప్రస్తుతం భారత్ ఫిబ్రవరి 5 నుంచి చెన్నై వేదికగా ఇంగ్లండ్‌తో ప్రారంభం కానున్న నాలుగు టెస్ట్‌ల సిరీస్ కోసం సమయాత్తం అవుతోంది. పెటర్నీటీ లీవ్ పూర్తి చేసుకున్న విరాట్ తిరిగి జట్టులోకి వచ్చాడు. కూతురు పుట్టిన సంతోషంలో ఉన్న విరాట్ రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగుతున్నాడు.