స్టార్ కల్చర్‌కు నెలవైన భారత క్రికెట్‌లో ఆటగాళ్లను దాటి కోచ్ అందరి దృష్టిలో నిలవడం, ఆధిపత్యం చలాయించడం చాలా అరుదు. గతంలో గ్రేగ్ ఛాపెల్, అనిల్ కుంబ్లేలు ఆటగాళ్లను అదుపు చేయాలని ప్రయత్నించి జట్టుకే దూరమయ్యారు. కానీ గౌతమ్ గంభీర్ స్టార్ కల్చర్‌కు తెరదించి.. అందరి దృష్టిని ఆకర్షించాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్‌తో టీమిండియాను గంభీర్ శాసించే సంకేతాలు కనిపిస్తున్నాయి.
కుర్రాళ్లతో కూడిన భారత జట్టుకు గంభీరే సర్వాధికారి కాబోతున్నాడు. టీమిండియా మాజీ క్రికెటర్ సబా కరీం సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. శుభ్‌మన్ గిల్, జస్‌ప్రీత్ బుమ్రా భారత జట్టు పగ్గాలు అందుకున్నా.. గంభీర్‌దే పూర్తి ఆధిపత్యం ఉంటుందని సబా కరీం అభిప్రాయపడ్డాడు. తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్ల్యూలో సబా కరీం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల రిటైర్మెంట్‌తో భారత జట్టులో గౌతమ్ గంభీర్ కీలక వ్యక్తిగా మారనున్నాడు. ఎందుకంటే అతనే ఆటగాళ్లకు ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వనున్నాడు. అయితే అతను కొత్త కెప్టెన్‌ను, అతను ఆడాలనుకుంటున్న బ్రాండ్ ఆఫ్ క్రికెట్‌ను బాగా అర్థం చేసుకోవాలి.

గంభీర్ తన జట్టు ఆట, అప్రోచ్ గురించి స్పష్టమైన ఆలోచనలతో ఉన్నాడు. అయితే అతను జట్టులో శక్తివంతమైన లీడర్లను తయారు చేయాలి. గంభీర్ కచ్చితంగా రిషభ్ పంత్‌కు అండగా ఉంటాడు. ఆస్ట్రేలియా పర్యటనలో పంత్ ఆశించిన రీతిలో రాణించలేదు. ఇంగ్లండ్ పర్యటనలో అతనికి అండగా నిలిచి మరింత ఆత్మవిశ్వాసాన్ని అందిస్తాడు. గంభీర్ దేశవాళీ క్రికెట్‌లో రాణిస్తున్న ఆటగాళ్లను ప్రోత్సహించడం చాలా ముఖ్యం. శ్రేయస్ అయ్యర్ , అభిమన్యు ఈశ్వరన్ వంటి ఆటగాళ్లను ఎంపిక చేసిన తర్వాత వారికి తగిన అవకాశాలు ఇవ్వాలి.'అని సబా కరీమ్ చెప్పుకొచ్చాడు.