
న్యూఢిల్లీ: గాయంతో బాధపడుతున్న టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను టీ20 ప్రపంచకప్‌కు ఎందుకు ఎంపిక చేశారని మాజీ క్రికెటర్ సబా కరీం ప్రశ్నించాడు. నిబంధనల ప్రకారం ఏ ఆటగాడైన గాయంతో బాధపడుతున్నప్పుడు నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ)లో చేరి, రిహాబిలిటేషన్ పాటించి ఫిట్‌నెస్ నిరూపించుకున్నాకే జట్టులోకి తీసుకుంటారని, మరీ ఈ రల్ హార్దిక్ పాండ్యా వర్తించదా? అని సబా కరీం నీలదీసాడు. దీనికి భారత సెలెక్టర్లు సమాధానం చెప్పాలన్నాడు. తాజాగా 'ఖేల్‌నీతి'యూట్యూబ్ చానెల్‌తో మాట్లాడుతూ కరీం ఈ వ్యాఖ్యలు చేశాడు.
'హార్దిక్ పాండ్యా బిగ్ ప్లేయర్. అతనో మంచి ఆల్‌రౌండర్. కానీ అతన్ని టీ20 ప్రపంచకప్‌కు ఎంపిక చేయడంలోనే క్లారిటీ లేదు. అసలు అతను ఫిట్‌గా ఉన్నాడా? లేదా? ఫిట్‌గా ఉంటే మాత్రం ఏ సమస్య లేదు. కానీ లేకుంటే మాత్రం అతనికెప్పుడు గాయమైంది. గాయంతో బాధపడుతున్న అతన్ని ఎందుకు ఎంపిక చేశారు? మాములుగా జట్టుకు దూరమైన ఆటగాళ్లు గాయపడితే ఎన్‌సీఏకు వెళ్లి ఫిట్‌నెస్ నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఇది ప్రతీ ఆటగాడికి వర్తిస్తుంది. మరి పాండ్యా విషయంలో ఇలా ఎందుకు జరగలేదు. అతనికి నిబంధనలు వర్తించవా? దీనికి బీసీసీఐ సమాధానం చెప్పాలి. అసలు పాండ్యా విషయంలో ఏం జరుగుతుందో మాకు అర్థం కావడం లేదు'అని సబా కరీం చెప్పుకొచ్చాడు.
ఇక ఐపీఎల్ 2021 సెకండాఫ్ లీగ్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్‌ల గురించి అప్పుడే ఒక అభిప్రాయానికి రావద్దన్నాడు. టీ20 క్రికెట్‌లో నిలకడగా ఆడటం సవాల్‌తో కూడుకున్నదని, ఈ ఇద్దరి ఆటగాళ్ల పట్ల అభిమానులు కొంచెం ఓపికగా ఉండాలన్నాడు. 'సూర్య, ఇషాన్ పెర్ఫామెన్స్‌పై మాట్లాడటం చాలా తొందరవుతుంది. టీ20 క్రికెట్‌లో నిలకడగా రాణించడం సవాల్‌తో కూడుకున్నది. కాబట్టి అభిమానులు కొంచెం ఓపికగా ఉండాలి.'అని సబా కరీం చెప్పుకొచ్చాడు.
ఇక ఐపీఎల్ 2021 సెకండాఫ్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో హార్దిక్ పాండ్యా ఆడలేదు. అయితే అతను గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడని, టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో బీసీసీఐ ఆదేశాల మేరకే విశ్రాంతినిస్తున్నామని ముంబై ఫ్రాంచైజీ పేర్కొంది. రోహిత్ శర్మ సైతం ఇదే కారణంతో చెన్నైతో జరిగిన ఫస్ట్ మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు. ఇక ఆర్‌సీబీతో జరిగే తదుపరి మ్యాచ్‌లో హార్దిక్ ఆడే అవకాశాలున్నాయి.