శ్రీలంకతో తొలి వన్డేలో కెప్టెన్‌గా రోహిత్ శర్మ చేసిన తప్పిదమే టీమిండియా విజయవకాశాలను దెబ్బతీసిందని మాజీ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ సబా కరీం అన్నాడు. శుభ్‌మన్ గిల్‌తో బౌలింగ్ చేయించడం టీమిండియాకు తీవ్ర నష్టం చేసిందన్నాడు. అతను ఒకే ఓవర్‌లో 14 పరుగులు ఇవ్వడంతో మూమెంటమ్ శ్రీలంక వైపు మళ్లిందని అభిప్రాయపడ్డాడు.
ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల స్కోర్లు టై అయ్యాయి. సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్‌ను టీమిండియా చేజేతులా టై చేసుకుంది. రెండు వికెట్లను చేతిలో పెట్టుకొని 18 బంతుల్లో 5 పరుగులు చేయలేకపోయింది. శివమ్ దూబే, అర్ష్‌దీప్ సింగ్ వరుస బంతుల్లో ఔటవ్వడంతో మ్యాచ్ టైగా మారింది.

ఫలితం తేలని తొలి వన్డే..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 230 పరుగులు చేసింది. అనంతరం భారత్ 47.5 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌటైంది. రోహిత్ శర్మ ( 47 బంతుల్లో, 7 ఫోర్లు, 3 సిక్సర్లు 58) హాఫ్ సెంచరీతో రాణించగా.. అక్షర్ పటేల్ ( 57 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 33), కేఎల్ రాహుల్ ( 43 బంతుల్లో, 2 ఫోర్లతో 31) పర్వాలేదనిపించారు.
శ్రీలంక బౌలర్లలో హసరంగ (3/58), అసలంక (3/30) మూడేసి వికెట్లు తీయగా.. వెల్లలాగే రెండు వికెట్లతో సత్తాచాటాడు. ద్వైపాక్షిక సిరీస్‌ల్లోని వన్డేల్లో స్కోర్లు టై అయితే సూపర్ ఓవర్ నిర్వహించాలనే నిబంధన లేకపోవడంతో ఈ మ్యాచ్ ఫలితం తేలకుండానే ముగిసింది.
అతని బౌలింగ్ చేయించాల్సింది..
ఈ మ్యాచ్ అనంతరం అధికారిక బ్రాడ్‌కాస్టర్ సోనీ స్పోర్ట్స్ షోలో మాట్లాడిన సబా కరీం, అజేయ్ జడేజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. శుభ్‌మన్ గిల్‌కు బదులు శివమ్ దూబేతో మరిన్ని ఓవర్లు వేయించి ఉండాల్సిందని సబా కరీం అభిప్రాయపడ్డాడు.
'శ్రీలంకతో చివరి టీ20లో సూర్యకుమార్ యాదవ్, రియాన్ పరాగ్, రింకూ సింగ్‌లతో బౌలింగ్ చేయించినట్లు.. తొలి వన్డేలోనూ పార్ట్ టైమ్ స్పిన్నర్లను ఉపయోగించుకోవాలని టీమిండియా మేనేజ్‌మెంట్ భావించింది.
శుభ్‌మన్ గిల్‌కు బంతిని అందించింది. అంతర్జాతీయ క్రికెట్‌లో తొలిసారి బౌలింగ్ చేసిన గిల్ ధారళంగా పరుగులిచ్చాడు. బ్యాటింగ్‌కు ప్రతికూలంగా ఉన్న వికెట్‌పై 14 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ ఓవర్‌తో శ్రీలంక మూమెంటమ్ అందుకుంది.
స్పిన్‌కు అనుకూలంగా ఉన్న ఈ వికెట్‌పై భారత్‌కు ఓ ఎక్స్‌ట్రా స్పిన్నర్ అవసరమయ్యాడు. అయితే శివమ్ దూబేతో టీమిండియా మరికొన్ని ఓవర్లు బౌలింగ్ చేయించాల్సింది. కానీ గిల్‌ను ప్రయత్నించారు. ఈ ప్రయోగం బెడిసి కొట్టింది.'అని సబా కరీం చెప్పుకొచ్చాడు.
రాంగ్ టైమ్‌లో గిల్‌తో బౌలింగ్..
సబా కీరం వ్యాఖ్యలతో ఏకీభవించిన అజయ్ జడేజా.. మ్యాచ్ పరిస్థితులను అర్థం చేసుకోకుండా శుభ్‌గిల్‌కు బౌలింగ్ ఇచ్చారని తెలిపాడు. 'మూడో టీ20లో రింకూ సింగ్‌కు బౌలింగ్ ఇచ్చారంటే ఓ అర్థం ఉంది. ఆ మ్యాచ్ దాదాపు భారత్ చేతిలో నుంచి చేజారిన పరిస్థితుల్లో అతనికి బౌలింగ్ ఇచ్చి ఫలితాన్ని రాబట్టారు.
కానీ ఈ మ్యాచ్‌లో భారత్ మంచి పొజిషన్‌లో ఉండగా.. శుభ్‌మన్ గిల్‌తో బౌలింగ్ చేయించి మూల్యం చెల్లించుకుంది. కొత్త ఆప్షన్స్‌ను ప్రయత్నించడం సరైనదే కానీ.. మ్యాచ్ పరిస్థితులకు తగ్గట్లు ప్రయోగాలు చేయడం ముఖ్యం'అని అజేయ జడేజా చెప్పుకొచ్చాడు.