Saba Karim: అలా చేస్తే వచ్చే మూడు ప్రపంచకప్‌లు కోహ్లీసేనవే!

న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఐసీసీ ట్రోఫీ అందని ద్రాక్షగానే మిగిలిపోతుంది. ప్రతీ టోర్నీలో ఆఖరి వరకు ఊరించడం.. చివరి మెట్టుపై బోల్తా పడటం కోహ్లీసేనకు అలవాటైపోయింది. 2017 చాంపియన్స్ ట్రోఫీ, 2019 వన్డే ప్రపంచకప్, ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లో భారత్ చివరి క్షణంలో తడబడి బంగారం లాంటి అవకాశాలను కోల్పోయింది.
అయితే 2023 వరకు వరుసగా షెడ్యూల్ చేసిన మెగా టోర్నీలు కోహ్లీకి కలిసొచ్చే అంశమని టీమిండియా మాజీ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ సాబా కరీం అభిప్రాయపడ్డాడు.సమతూకమైన జట్టు.. పకడ్బందీ ప్రణాళికలతో బరిలోకి దిగితే కోహ్లీసేన వరుసగా మూడు ప్రపంచకప్‌లు గెలవచ్చన్నాడు.

మొదటిది గెలిస్తే..
వచ్చే రెండేళ్లు విరాట్ కోహ్లీకి బంగారం లాంటి అవకాశమని, మూడు ఫార్మాట్లలో విశ్వవిజేతగా నిలవవచ్చన్నాడు. ఐసీసీ షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ జరగనుండగా.. వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా మరో టీ20 ప్రపంచకప్, 2023లో భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరగనుంది. ఈ క్రమంలోనే ఇండియా న్యూస్‌తో మాట్లాడిన సబాకరీం.. అప్‌కమింగ్ టీ20 ప్రపంచకప్‌ను కోహ్లీసేన చేజిక్కించుకుంటే వరుసగా మరో రెండేళ్లు ఆధిపత్యం చెలాయించవచ్చన్నాడు.

సువర్ణావకాశం..
'విరాట్ కోహ్లీ, భారత జట్టుకు ఇదో సువర్ణావకాశం. ఒకదాని వెనుక మరొకటి అన్నట్లు వరుసగా ప్రపంచకప్ టోర్నీలు జరగనున్నాయి. యూఏఈ వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్‌ను భారత్ గెలిస్తే.. టీమ్‌పై నమ్మకం పెరుగుతోంది. తదుపరి ప్రపంచకప్‌ల్లో కూడా ఇదే రీతిలో రాణిస్తే ఆ రెండు కూడా కోహ్లీసేన వశం అవుతాయి'అని సాబా కరీం చెప్పుకొచ్చాడు. సమతూకమైన జట్టు, పకడ్బందీ ప్రణాళికలను మైదానంలో అమలు పరిస్తే కోహ్లీసేనకు తిరుగండదన్నాడు.

మంచి టీమ్‌తో..
'మనకు మంచి టీమ్ ఉంది. ఆట పట్ల అంకితభావం కలిగిన ఆటగాళ్లున్నారు. అలాగే అత్యధిక అభిమాన గణం ఉంది. మెగా టోర్నీల్లో సమతూకమైన జట్టుతో బరిలోకి దిగి.. ప్రణాళికలను పకడ్బందీగా అమలు చేస్తే సులువుగా విజయం సాధించవచ్చు'అని సాబా కరీం చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం కోహ్లీ సేన ఇంగ్లండ్ పర్యటనలో సెలవులను ఆస్వాదిస్తుండగా.. ఆగస్ట్ 4 నుంచి ఆతిథ్య జట్టుతో ఐదు టెస్ట్‌ల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ అనంతరం ఐపీఎల్ జరగనుండగా.. మెగా లీగ్ ముగిసిన 10-12 రోజులకు టీ20 ప్రపంచకప్ జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications