
సెంచూరియన్: సొంతగడ్డపై వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండు టెస్ట్‌ల సిరీస్‌లో సౌతాఫ్రికా శుభారంభం చేసింది. గురువారం ముగిసిన తొలి టెస్ట్‌లో సమష్టిగా రాణించిన సౌతాఫ్రికా 87 పరుగుల తేడాతో వెస్టిండీస్‌ను చిత్తు చేసింది. 247 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ 159 పరుగులకే కుప్పకూలింది. సౌతాఫ్రికా పేసర్ కగిసో రబడా(6/50) ఆరు వికెట్లతో విండీస్ పతనాన్ని శాసించాడు. అతనికి తోడుగా మార్కో జాన్సెన్ రెండు వికెట్లు తీయగా... అన్రిచ్ నోర్జ్ ఓ వికెట్ పడగొట్టాడు. విండీస్ బ్యాటర్లలో జెర్మైన్ బ్లాక్‌వుడ్(79) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు.
అంతకు ముందు 49/4 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన సౌతాఫ్రికా 116 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ ఎయిడెన్ మార్క్‌రమ్(47) ఒక్కడే రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. విండీస్ బౌలర్లో కేమర్ రోచ్ ఐదు వికెట్లతో చెలరేగగా.. అల్జారీ జోసెఫ్, జాసన్ హోల్డర్స్ రెండేసి వికెట్లు పడగొట్టారు. గాబ్రియల్‌కు ఓ వికెట్ దక్కింది. ఈ జోరును బ్యాటింగ్‌లో చూపించలేకపోయిన విండీస్.. ఘోర పరాజయాన్ని చవిచూసింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 342 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ ఎయిడెన్ మార్క్‌రమ్(115) సెంచరీ చేయగా.. మరో ఓపెనర్ డీన్ ఎల్గర్(71) హాఫ్ సెంచరీతో రాణించాడు. అనంతరం వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 212 పరుగులకు కుప్పకూలింది. దాంతో సౌతాఫ్రికాకు 130 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఈ లీడే ఆ జట్టుకు విజయాన్నందించింది. సెంచరీతో సఫారీ విజయంలో కీలక పాత్ర పోషించిన మార్క్‌రమ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.