అంతర్జాతీయ వన్డేల్లో పాకిస్థాన్ క్రికెట్ టీమ్ చరిత్ర సృష్టించింది. 21వ శతాబ్దంలో సౌతాఫ్రికా గడ్డపై వరుసగా మూడు వన్డేల సిరీస్‌ను గెలుచుకున్న తొలి జట్టుగా రికార్డ్ సాధించింది. సౌతాఫ్రికాతో గురువారం జరిగిన రెండో వన్డేలో 81 పరుగుల తేడాతో విజయం సాధించిన పాకిస్థాన్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే మూడు వన్డేల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది.
సఫారీ గడ్డపై పాకిస్థాన్‌కు ఇది వరుసగా మూడో వన్డే సిరీస్ విజయం. ఆ జట్టు 2013, 2021లో సిరీస్‌లను కైవసం చేసుకుంది. 7 పర్యటనలో పాకిస్థాన్ మూడు సార్లు వన్డే సిరీస్ గెలిచింది. పాకిస్థాన్ తర్వాత ఆస్ట్రేలియా 10 పర్యటనల్లో మూడు సార్లు సౌతాఫ్రికా గడ్డపై వన్డే సిరీస్ కైవసం చేసుకుంది.

వచ్చే ఏడాది సొంతగడ్డపై జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ముందు ఈ సిరీస్ విజయం పాకిస్థాన్ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేయనుంది. హైబ్రిడ్ మోడల్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ జరగనున్న విషయం తెలిసిందే. భారత మ్యాచ్‌లు దుబాయ్ వేదికగా జరగనున్నాయి. చివరిసారిగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ 2017లో పాకిస్థాన్ విజేతగా నిలిచింది. ఫైనల్లో భారత్‌ను ఆ జట్టు ఓడించింది.
ఈ సిరీస్ విజయంపై పాక్ కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్ సంతోషం వ్యక్తం చేశాడు. 'జట్టులోని ప్రతీ ఒక్కరు రాణించారు. శుభారంభం దక్కకున్నా మాకు మంచి భాగస్వామ్యం కూడా లభించింది. నేను, బాబర్ ఆజామ్ నెమ్మదిగా ఆడి ఇన్నింగ్స్‌కు గట్టి పునాది వేసాం. 300 పరుగులు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. కానీ కమ్రాన్ గులామ్ సూపర్ బ్యాటింగ్‌తో 320 పరుగులు చేశాం. ఓ కెప్టెన్‌గా అతనిపై నాకు నమ్మకం ఉంది. కానీ ఈ రోజు అతను స్థాయికి తగ్గట్లు రాణించలేదు(నవ్వుతూ). బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబర్చారు.'అని విజయానంతరం రిజ్వాన్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 49.5 ఓవర్లలో 329 పరుగులకు ఆలౌటైంది. మహమ్మద్ రిజ్వాన్(82 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 80), బాబర్ ఆజామ్(95 బంతుల్లో 7 ఫోర్లతో 73), కమ్రాన్ గులామ్(32 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 63) హాఫ్ సెంచరీలతో రాణించారు.
సౌతాఫ్రికా బౌలర్లలో క్వేనా మఫకా(4/72) నాలుగు వికెట్లు తీయగా.. మార్కో జాన్సెన్(3/71) మూడు వికెట్లు పడగొట్టాడు. ఫర్చూన్, పెహ్లుక్వాయోకు చెరో వికెట్ దక్కింది. అనంతరం సౌతాఫ్రికా 43.1 ఓవర్లలో 248 పరుగులకు కుప్పకూలింది. హెన్రీచ్ క్లాసెన్(74 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 97) తృటిలో శతకం చేజార్చుకున్నాడు. అతనికి తోడు మరే బ్యాటర్ రాణించలేదు.
పాకిస్థాన్ బౌలర్లలో షాహిన్ షా అఫ్రిది(4/47) నాలుగు వికెట్లు తీయగా.. నసీమ్ షా(3/37) మూడు వికెట్లు పడగొట్టాడు. అబ్రార్ అహ్మద్(2/48)కు రెండు వికెట్లు దక్కగా.. సల్మాన్ అఘాకు ఓ వికెట్ దక్కింది. తొలి వన్డేలోనూ పాకిస్థాన్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దాంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ సొంతం చేసుకుంది. ఇరు జట్ల మధ్య మూడో వన్డే ఆదివారం జరగనుంది.