సౌతాఫ్రికా పర్యటనను పాకిస్థాన్ ఘోర పరాజయంతో ముగించింది. సోమవారం ముగిసిన రెండో టెస్ట్‌లో సౌతాఫ్రికా 10 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. ఈ విజయంతో రెండు టెస్ట్‌ల సిరీస్‌ను సౌతాఫ్రికా 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. 58 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా 7.1 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 61 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. డేవిడ్ బెడింగ్‌హమ్(30 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 47 నాటౌట్) దూకుడుగా ఆడగా.. ఎయిడెన్ మార్క్‌రమ్(13 బంతుల్లో ఫోర్‌తో 14 నాటౌట్) అతనికి అండగా నిలిచాడు.
అంతకుముందు 213/1 ఓవర్‌నైటక స్కోర్‌తో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన పాకిస్థాన్ 122.1 ఓవర్లలో 478 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ షాన్ మసూద్(251 బంతుల్లో 17 ఫోర్లతో 145) సెంచరీతో రాణించగా.. మరో ఓపెనర్ బాబర్ ఆజామ్(124 బంతుల్లో 10 ఫోర్లతో 81) శతకాన్ని చేజార్చుకున్నాడు. మహమ్మద్ రిజ్వాన్(41), సల్మాన్ అఘా(48) హాఫ్ సెంచరీలు సాధించలేకపోయారు. సౌతాఫ్రికా బౌలర్లలో కగిసో రబడా, కేశవ్ మహరాజ్ మూడేసి వికెట్లు తీయగా.. మార్కో జాన్సెన్ రెండు వికెట్లు పడగొట్టాడు. క్వెనా మఫకాకు ఓ వికెట్ దక్కింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 615 పరుగుల భారీ స్కోర్ చేసింది. ర్యాన్ రికెల్టన్(343 బంతుల్లో 29 ఫోర్లు, 3 సిక్స్‌లతో 259) డబుల్ సెంచరీతో చెలరేగగా.. టెంబా బవుమా(106), కైల్ వెర్రెన్న్(100) శతకాలతో రాణించారు. మార్కో జాన్సెన్(62) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. పాక్ బౌలర్లలో మహమ్మద్ అబ్బాస్, సల్మాన్ అఘా మూడేసి వికెట్లు తీయగా.. మిర్ హంజా, ఖుర్రమ్ షెహ్‌జాద్ రెండేసి వికెట్లు తీసారు.
అనంతరం పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 194 పరుగులకే ఆలౌటైంది. బాబర్ ఆజామ్(58), మహమ్మద్ రిజ్వాన్(46) మినహా అంతా విఫలమయ్యారు. సౌతాఫ్రికా బౌలర్లలో కగిసో రబడా మూడు వికెట్లు తీయగా.. మఫకా, కేశవ్ మహరాజ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. దాంతో పాకిస్థాన్ ఫాలో ఆన్ ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
రెండో ఇన్నింగ్స్‌లో మెరుగ్గా బ్యాటింగ్ చేయడంతో ఆ జట్టు ఘోర పరాజయాన్ని తప్పించుకుంది. మూడు టీ20ల సిరీస్‌ను 2-0తో కోల్పోయిన పాక్.. మూడు వన్డేల సిరీస్‌ను మాత్రం 3-0తో గెలుచుకుంది. టెస్ట్ సిరీస్‌ను మాత్రం పాక్ 0-2తో కోల్పోయింది. ఇప్పటికే డబ్ల్యూటీసీ ఫైనల్ 2025 బెర్త్‌ను దక్కించుకున్న సౌతాఫ్రికా.. ఆస్ట్రేలియాతో తుది పోరులో తలపడనుంది.