న్యూజిలాండ్ బ్యాటర్ల అసాధారణ ప్రదర్శనతోనే ఓటమిపాలయ్యామని సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా అన్నాడు. బౌలింగ్‌లో భారీగా పరుగులివ్వడం.. బ్యాటింగ్‌లో సెట్ అయిన బ్యాటర్లు త్వరగా ఔటవ్వడం తమ విజయవకాశాలను దెబ్బతీసాయని అభిప్రాయపడ్డాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బుధవారం జరిగిన సెమీఫైనల్లో న్యూజిలాండ్ 50 పరుగుల తేడాతో సౌతాఫ్రికాను చిత్తు చేసి ఫైనల్ చేరింది.
ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన బవుమా.. ప్రత్యర్థిని 350 పరుగుల్లోపు కట్టడి చేసుంటే ఫలితం మరోలా ఉండేదన్నాడు. న్యూజిలాండ్ అద్భుత ప్రదర్శనతో తమపై ఒత్తిడి తెచ్చిందని తెలిపాడు.

నేను ఆడాల్సింది..
'న్యూజిలాండ్ భారీ లక్ష్యం నమోదు చేసింది. మేం 10-20 పరుగులు అదనంగా ఇచ్చాం. వారు బ్యాటింగ్ చేసిన విధానం చూసి మేం సునాయసంగా 350 పరుగుల లక్ష్యాన్ని చేధిస్తామని భావించాను. మాకు ఒకటి, రెండు కీలక భాగస్వామ్యాలు కూడా వచ్చాయి. కానీ నేను లేదా రాసీ వాన్ డెర్ డస్సెన్ ఎవరో ఒకరం భారీ ఇన్నింగ్స్ ఆడాల్సింది. కానీ అలా జరగలేదు.
గెలుపు క్రెడిట్ వారిదే..
న్యూజిలాండ్ మమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టి వికెట్లు సాధించింది. న్యూజిలాండ్ బ్యాటర్లు మిడిల్ ఓవర్లలో ఆఫ్ సైడ్ క్రమం తప్పకుండా బౌండరీలు రాబట్టారు. చేతిలో వికెట్లు ఉండటంతో డెత్ ఓవర్లలో వారి బ్యాటర్లను కట్టడి చేయలేకపోయాం. ఈ గెలుపు క్రెడిట్ న్యూజిలాండ్ బ్యాటర్లదే, రచిన్, విలియమ్సన్‌తో పాటు డారిల్ మిచెల్, గ్లేన్ ఫిలిప్స్ అద్భుతంగా ఆడారు.
చేధనలో మేం 125/1తో మెరుగైస స్థితిలో నిలిచాం. క్రీజులో నాతో పాటు రాసీ సెట్ అయ్యి ఉన్నాడు. కానీ దురదృష్టవశాత్తు కీలక సమయంలో ఔటై.. మిడిలార్డర్ బ్యాటర్లపై ఒత్తిడిని పెంచాం. స్వేచ్చగా ఆడేందుకు కావాల్సిన పునాదిని వేయలేకపోయాం. నాది సాఫ్ట్ డిస్‌మిస్సల్ కానీ రాసీ అద్భుతమైన బంతికి వెనుదిరిగాడు. దాంతో మా బ్యాటర్లపై ఒత్తిడి పెరిగింది. మెం ఇంకాస్త మెరుగ్గా ఆడి ఉండాల్సింది. కీలక సమయంలో ఔటై ప్రత్యర్థికి అవకాశం కల్పించాం. 'అని టెంబా బవుమా చెప్పుకొచ్చాడు.
మలుపు తిప్పిన ఫిలిప్స్
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 362 పరుగుల భారీ స్కోర్ చేసింది. రచిన్ రవీంద్ర(101 బంతుల్లో 13 ఫోర్లు, సిక్స్‌తో 108), కేన్ విలియమ్సన్(94 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లతో 102) శతకాలతో రాణించారు. డారిల్ మిచెల్(37 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 49) , గ్లేన్ ఫిలిప్స్ (18 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 49 నాటౌట్) విలువైన పరుగులు చేశారు.
అనంతరం సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 312 పరుగులే చేసి ఓటమిపాలైంది. కెప్టెన్ టెంబా బవుమా(71 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 56), రాసీ వాన్ డెర్ డస్సెన్(66 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 69) హాఫ్ సెంచరీలతో రాణించారు. చివర్లో డేవిడ్ మిల్లర్(67 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 100 నాటౌట్) అజేయ శతకంతో ఒంటరి పోరాటం చేశాడు.