న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ వన్డేల్లో అత్యంత వేగంగా 7వేల పరుగుల మైలురాయి అందుకున్న రెండో బ్యాటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రికార్డ్‌ను అధిగమించాడు. ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో కేన్ విలియమ్సన్ సెంచరీ బాది ఈ ఫీట్ అందుకున్నాడు.
అతను 159 ఇన్నింగ్స్‌ల్లో 7వేల పరుగుల మైలురాయి అందుకోవడం విశేషం. విరాట్ కోహ్లీ 161 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించగా.. ఆషీమ్ ఆమ్లా 151 ఇన్నింగ్స్‌ల్లో 7వేల పరుగుల మైలురాయి అందుకొని అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఏబీ డివిలియర్స్(161), సౌరవ్ గంగూలీ(174), రోహిత్ శర్మ(181) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

న్యూజిలాండ్ తరఫున వన్డేల్లో 7వేల పరుగుల మైలురాయి అందుకున్న ఐదో బ్యాటర్‌గా కేన్ మామ నిలిచాడు. అతని కన్నా ముందు రాస్ టేలర్, స్టీఫెన్ ఫ్లెమింగ్, మార్టిన్ గప్టిల్, నాథన్ ఆస్ట్లే వన్డేల్లో ఏడు వేల పరుగులు చేసిన జాబితాలో ఉన్నారు. దాదాపు ఐదేళ్ల తర్వాత వన్డేల్లో కేన్ విలియమ్సన్ సెంచరీ సాధించాడు. 113 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్‌లతో 133 పరుగులతో అజేయంగా నిలిచి న్యూజిలాండ్‌కు విజయాన్ని అందించాడు. ఈ గెలుపుతో న్యూజిలాండ్ ఈ ముక్కోణపు సిరీస్ ఫైనల్ చేరింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 304 పరుగులు చేసింది. అరంగేట్ర ప్లేయర్ మాథ్యూ బ్రీట్జ్‌కే(148 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్స్‌లతో 150) విధ్వంసకర శతకంతో చెలరేగగా.. వియాన్ మల్డర్(60 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 64) హాఫ్ సెంచరీతో రాణించారు. అరంగేట్ర వన్డేలోనే 150 పరుగులు చేసిన తొలి బ్యాటర్ మాథ్యూ బ్రీట్జ్‌కే చరిత్రకెక్కాడు. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ, విల్ ఓ రూర్కీ రెండేసి వికెట్లు తీయగా.. మైఖేల్ బ్రేస్‌వెల్ తలో వికెట్ పడగొట్టారు.
నంతరం న్యూజిలాండ్ 48.4 ఓవర్లలో 4 వికెట్లకు 308 పరుగులు చేసి గెలుపొందింది. కేన్ విలియమ్సన్ అజేయ శతకంతో చెలరేగగా.. డెవాన్ కాన్వే(107 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్‌తో 97) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. సౌతాఫ్రికా బౌలర్లలో ముతుసామి రెండు వికెట్లు తీయగా.. జూనియర్ డాలా, ఎథన్ బోస్చ్ తలో వికెట్ పడగొట్టారు. బుధవారం సౌతాఫ్రికాతో పాకిస్థాన్ తలపడనుండగా.. ఈ మ్యాచ్‌లో గెలిచే జట్టుతో ఫిబ్రవరి 14న కివీస్ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది.