ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ముందు పాకిస్థాన్ వేదికగా జరుగుతున్న ముక్కోణపు వన్డే సిరీస్‌లో న్యూజిలాండ్ జోరు కొనసాగుతోంది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఆ జట్టు విజయం సాధించింది. సౌతాఫ్రికాతో సోమవారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన న్యూజిలాండ్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. కేన్ విలియమ్సన్, డెవాన్ కాన్వే అసాధారణ బ్యాటింగ్‌తో న్యూజిలాండ్ విజయంలో కీలక పాత్ర పోషించారు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 304 పరుగులు చేసింది. అరంగేట్ర ప్లేయర్ మాథ్యూ బ్రీట్జ్‌కే(148 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్స్‌లతో 150) విధ్వంసకర శతకంతో చెలరేగగా.. వియాన్ మల్డర్(60 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 64) హాఫ్ సెంచరీతో రాణించారు. అరంగేట్ర వన్డేలోనే 150 పరుగులు చేసిన తొలి బ్యాటర్ మాథ్యూ బ్రీట్జ్‌కే చరిత్రకెక్కాడు. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ, విల్ ఓ రూర్కీ రెండేసి వికెట్లు తీయగా.. మైఖేల్ బ్రేస్‌వెల్ తలో వికెట్ పడగొట్టారు.

కేన్ మామ, కాన్వే విధ్వంసం..
అనంతరం న్యూజిలాండ్ 48.4 ఓవర్లలో 4 వికెట్లకు 308 పరుగులు చేసి గెలుపొందింది. కేన్ విలియమ్సన్(113 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్‌లతో 133 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగగా.. డెవాన్ కాన్వే(107 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్‌తో 97) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. సౌతాఫ్రికా బౌలర్లలో ముతుసామి రెండు వికెట్లు తీయగా.. జూనియర్ డాలా, ఎథన్ బోస్చ్ తలో వికెట్ పడగొట్టారు.
బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న ఈ వికెట్‌పై ఇరు జట్ల బ్యాటర్లు చెలరేగారు. కానీ సౌతాఫ్రికా భారీ స్కోర్ చేయకుండా న్యూజిలాండ్ బౌలర్లు కట్టడి చేశారు. ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో పరుగులు ఇవ్వలేదు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన న్యూజిలాండ్‌కు డెవాన్ కాన్వే-కేన్ మామ రెండో వికెట్‌కు 187 పరుగులు జోడించారు. డారిల్ మిచెల్(10), టామ్ లాథమ్(0) విఫలమైనా.. గ్లేన్ ఫిలిప్స్(28 నాటౌట్) సాయంతో కేన్ మామ విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.
ఫైనల్‌కు కివీస్..
ఈ ముక్కోణపు సిరీస్‌లో వరుసగా రెండో విజయం సాధించిన న్యూజిలాండ్ పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానంలో నిలిచి ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. తొలి మ్యాచ్‌లో ఆతిథ్య పాకిస్థాన్‌ను న్యూజిలాండ్ ఓడించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో గ్లేన్ ఫిలిప్స్ విధ్వంసకర శతకంతో తమ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. బుధవారం సౌతాఫ్రికాతో పాకిస్థాన్ తలపడనుండగా.. ఈ మ్యాచ్‌లో గెలిచే జట్టుతో ఫిబ్రవరి 14న కివీస్ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది.