సంజూ శాంసన్ అద్భుతమైన సెంచరీతో పాటు స్పిన్నర్ల అసాధారణమైన బౌలింగ్ తమకు విజయాన్ని కట్టబెట్టిందని టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అన్నాడు. నాలుగు టీ20ల సిరీస్‌లో భాగంగా సౌతాఫ్రికాతో శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా 61 పరుగుల తేడాతో గెలుపొందింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 202 పరుగుల భారీ స్కోర్ చేసింది. సంజూ శాంసన్(50 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్స్‌లతో 107) విధ్వంసకర శతకంతో చెలరేగగా.. తిలక్ వర్మ(18 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 33) దూకుడుగా ఆడాడు. సౌతాఫ్రికా బౌలర్లలో గెరాల్డ్ కోయిట్జీ(3/37) మూడు వికెట్లు తీయగా.. మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, పీటర్, క్రుగర్ తలో వికెట్ తీసారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన సౌతాఫ్రికా ఓవర్లలో 141 పరుగులకే ఆలౌటై ఓటమిపాలైంది. హెన్రీచ్ క్లాసెన్(22 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 25), ర్యాన్ రికెల్టన్(11 బంతుల్లో3 ఫోర్లు, సిక్స్‌తో 21), గెరాల్డ్ కోయిట్జీ(11 బంతుల్లో 3 సిక్స్‌లతో 23) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తీ(3/25), రవి బిష్ణోయ్(3/28) మూడేసి వికెట్లు తీయగా.. ఆవేశ్ ఖాన్ రెండు వికెట్లు పడగొట్టాడు. అర్ష్‌దీప్ సింగ్‌కు ఓ వికెట్ దక్కింది.
సంజూ సూపరో సూపర్..
ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన సూర్యకుమార్ యాదవ్... సంజూ శాంసన్‌తో పాటు తమ స్పిన్నర్లపై ప్రశంసల జల్లు కురిపించాడు. తమ జట్టు బ్రాండ్ ఆఫ్ క్రికెట్ కొనసాగిస్తుందని సంతోషం వ్యక్తం చేశాడు. 'డర్బన్‌లో మాకు మెరుగైన రికార్డ్ ఉందనే విషయం నాకు తెలియదు. వెళ్లి తెలుసుకుంటాను. గత 3-4 ఏళ్లుగా మేం మా బ్రాండ్ ఆఫ్ క్రికెట్‌ను కొనసాగిస్తున్నాం.
గత కొన్నేళ్లుగా సంజూ శాంసన్ పడ్డ కష్టానికి ఫలితం దక్కింది. చాలా కష్టపడ్డాడు. దాంతో ఈ రోజు ఫలితాలు అందుకుంటున్నాడు. 90 పరుగుల వద్ద కూడా అతను బౌండరీల కోసం ప్రయత్నించాడు. వ్యక్తిగత ప్రదర్శన కోసం కాకుండా జట్టు కోసం ఆడుతున్నాడు. జట్టుగా ఆటగాళ్ల నుంచి మేం ఆశిస్తున్నది ఇదే.

స్పిన్నర్లతో కట్టడి చేశాం..
సౌతాఫ్రికా బ్యాటర్లను స్పిన్నర్లతో కట్టడి చేయడం మా వ్యూహం. కీలకమైన క్లాసెన్, మిల్లర్ వికెట్లను స్పిన్నర్లతో తీయాలనుకున్నాం. టీమ్ ప్రణాళికలను మా స్పిన్నర్లు పకడ్బందీగా అమలు చేశారు. నా కెప్టెన్సీని నేను ఆస్వాదిస్తున్నాను. మా కుర్రాళ్లు నా పనిని సులువు చేస్తున్నారని టాస్ సందర్భంగానే చెప్పాను. నాపై ఎలాంటి ఒత్తిడి లేదు.
ఫియర్‌లెస్ గేమ్‌తో మా కుర్రాళ్లు ఆటను ఆస్వాదిస్తున్నారు. అది నా పనిని మరింత సులువు చేస్తోంది. మేం వికెట్లు కోల్పోయినా.. ఎలాంటి ఒత్తిడికి గురవ్వకుండా స్వేచ్చగా ఆడుతున్నాం. ఇది టీ20 మ్యాచ్. 20 ఓవర్లు మాత్రమే ఉంటాయని తెలుసు. కానీ 17 ఓవర్లలోనే 200 పరుగులు చేస్తే ఎందుకు గెలవం అనేది మా నినాదం.'అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.