టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ సంజూ శాంసన్ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో వరుస ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు బాదిన తొలి భారత బ్యాటర్‌గా రికార్డ్ సాధించాడు. సౌతాఫ్రికాతో నాలుగు టీ20ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో శతకం సాధించడం ద్వారా సంజూ శాంసన్ ఈ ఫీట్ సాధించాడు.
ఈ మ్యాచ్‌లో సంజూ శాంసన్ 50 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్స్‌లతో 107 పరుగులు చేశాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో సంజూ శాంసన్‌కు ఇది రెండో సెంచరీ. అది కూడా వరుసగా సాధించాడు. గత నెలలో బంగ్లాదేశ్‌తో హైదరాబాద్ వేదికగా జరిగిన మూడో టీ20లో సంజూ శాంసన్ సెంచరీతో చెలరేగాడు. అదే జోరును సౌతాఫ్రికా గడ్డపై చూపించాడు.

భారీ సిక్సర్లతో ఊచకోత..
ఓపెనర్ అభిషేక్ శర్మ(7) విఫలమైనా.. సూర్యకుమార్ యాదవ్(21), తిలక్ వర్మ(33)లతో కలిసి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మ్యాచ్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన సంజూ శాంసన్.. భారీ సిక్స్‌లతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న సంజూ శాంసన్.. మరో 20 బంతుల్లోనే సెంచరీని అందుకోవడం విశేషం.
సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి రెండో వికెట్‌కు 66 పరుగులు జోడించిన సంజూ శాంసన్.. తిలక్ వర్మతో కలిసి మూడో వికెట్‌కు 77 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు.
భారత్ భారీ స్కోర్..
సంజూ సూపర్ బ్యాటింగ్‌తో ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 202 పరుగుల భారీ స్కోర్ చేసింది. సంజూ శాంసన్‌తో పాటు తిలక్ వర్మ(18 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 33) దూకుడుగా ఆడాడు. సౌతాఫ్రికా బౌలర్లలో గెరాల్డ్ కోయిట్జీ(3/37) మూడు వికెట్లు తీయగా.. మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, పీటర్, క్రుగర్ తలో వికెట్ తీసారు.
ధోనీ రికార్డ్ బద్దలు..
ఈ శతక ఇన్నింగ్స్‌తో సంజూ శాంసన్ తన పేరిట పలు రికార్డులను లిఖించుకున్నాడు. ప్రొఫెషనల్ టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా 7000 పరుగుల మైలురాయిని అందుకున్న బ్యాటర్‌గా నిలిచాడు. ఈ ఫీట్ సాధించేందుకు సంజూ శాంసన్ 269 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు. ఈ క్రమంలో మహేంద్ర సింగ్ ధోనీని అధిగమించాడు.
ఈ జాబితాలో కేఎల్ రాహుల్ అగ్రస్థానంలో ఉన్నాడు. అతను 197 ఇన్నింగ్స్‌ల్లో 7వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ(212), శిఖర్ ధావన్(246), సూర్యకుమార్ యాదవ్(249), సురేశ్ రైనా(251), సంజూ శాంసన్ కన్నా ముందున్నారు. రాబిన్ ఊతప్ప, మహేంద్ర సింగ్ ధోనీ 7వేల పరుగుల మైలురాయిని అందుకునేందుకు 269, 365 ఇన్నింగ్స్‌లు తీసుకున్నారు.
పంత్‌ను అధిగమించిన సంజూ..
అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక 50 ప్లస్ స్కోర్లు చేసిన మూడో బ్యాటర్‌గా సంజూ శాంసన్.. ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్ సరసన నిలిచాడు. ఈ ముగ్గురూ ఇప్పటి వరకు అంతర్జాతీయ టీ20ల్లో మూడేసి 50 ప్లస్ స్కోర్లు నమోదు చేశారు. ఈ క్రమంలో పంత్(2), ధోనీ(2) రికార్డులను సంజూ శాంసన్ అధిగమించాడు.