సంచలన బ్యాటింగ్‌తో సౌతాఫ్రికాతో నాలుగు టీ20ల సిరీస్‌లో శుభారంభం చేసిన టీమిండియా.. రెండో మ్యాచ్‌లో మాత్రం తడబడింది. టాపార్డర్, మిడిలార్డర్ చేతులెత్తేయడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 124 పరుగులు చేసింది.
భారత బ్యాటర్లలో హార్దిక్ పాండ్యా(45 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 39 నాటౌట్), అక్షర్ పటేల్(21 బంతుల్లో 4 ఫోర్లతో 27) టాప్ స్కోరర్లుగా నిలవగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సెన్, గెరాల్డ్ కోయిట్జీ, అండిలే సిమెలెన్, ఎయిడెన్ మార్క్‌రమ్, పీటర్ తలో వికెట్ తీసారు.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. పరుగుల ఖాతా తెరవకుండానే ఓపెనర్, గత మ్యాచ్ సెంచరీ హీరో సంజూ శాంసన్(0) వికెట్ కోల్పోయింది. మార్కో జాన్సెన్ వేసిన తొలి ఓవర్ మూడో బంతికి సంజూ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కోయిట్జీ వేసిన ఆ మరుసటి ఓవర్‌లో అభిషేక్ శర్మ(4) క్యాచ్ ఔటవ్వగా.. ఆ కాసేపటికే ఆండిలే సిమెలేన్.. కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్(4)ను వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. దాంతో పవర్ ప్లే ముగిసే సమయానికి భారత్ 3 వికెట్లకు 34 పరుగులు చేసింది.
తిలక్ వర్మ, అక్షర్ పటేల్ ఆచితూచి ఆడి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పే ప్రయత్నం చేశారు. కానీ డేవిడ్ మిల్లర్ స్టన్నింగ్ క్యాచ్‌కు తిలక్ వర్మ వెనుదిరిగాడు. నిలకడగా ఆడుతున్న అక్షర్ పటేల్ పీటర్ బౌలింగ్‌లో దురదృష్టకర రీతిలో రనౌటయ్యాడు.
హార్దిక్ పాండ్యా కొట్టిన స్ట్రైట్ షాట్.. పీటర్ చేతులను తాకి నాన్ స్ట్రైకర్ వికెట్లను తాకింది. అప్పటికే అక్షర్ పటేల్ క్రీజును దాటడంతో రనౌట్‌గా వెనుదిరిగాల్సి వచ్చింది. దాంతో 70 పరుగులకే టీమిండియా 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. బ్యాటింగ్‌కు వచ్చిన రింకూ సింగ్(9) కూడా తీవ్రంగా నిరాశపరిచాడు.
ఈ పరిస్థితుల్లో అర్ష్‌దీప్ సింగ్(7 నాటౌట్)తో కలిసి హార్దిక్ పాండ్యా జట్టు స్కోర్‌ను 100 పరుగులు ధాటించాడు. ఎక్కువగా తాను స్ట్రైక్ తీసుకుంటూ బౌండరీలు కొట్టాడు. హార్దిక్ కొట్టిన తొలి సిక్స్ ఈ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. ఆ తర్వాత భారీ షాట్లు ఆడే ప్రయత్నంలో హార్దిక్ బాల్స్‌ను డాట్ చేశాడు. సింగిల్స్ తీసుకునే అవకాశం ఉన్నా తీయలేదు.
భారీ సిక్స్ బాదిన అర్ష్‌దీప్ సింగ్ బ్యాటింగ్ సామర్థ్యాన్ని హార్దిక్ నమ్మలేదు. దాంతో చివరి 12 బంతుల్లో 9 పరుగులు మాత్రమే చేశాడు. ఆఖరి ఓవర్‌లో వరుసగా 4 బంతులను డాట్ చేసిన హార్దిక్.. ఐదో బంతికి క్విక్ డబుల్ తీసాడు. చివరి బంతిని బౌండరీకి తరలించాడు. హార్దిక్ పాండ్యా అతివిశ్వాసంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అర్ష్‌దీప్ సింగ్‌కు స్ట్రైక్ ఇవ్వాల్సిందని అభిప్రాయపడుతున్నారు.