SA vs BAN: వన్డే ప్రపంచకప్ 2023లో సౌతాఫ్రికా మరో విజయాన్ని అందుకుంది. బంగ్లాదేశ్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన సౌతాఫ్రికా 149 పరుగుల తేడాతో గెలుపొందింది. ముందుగా విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగిన సఫారీ టీమ్.. ఆ తర్వాత బౌలింగ్‌లో రఫ్ఫాడించింది. ఈ విజయంతో సౌతాఫ్రికా పాయింట్స్ టేబుల్‌లో రెండో స్థానంలో నిలిచింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 382 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ క్వింటన్ డికాక్(140 బంతుల్లో 15 ఫోర్లు, 7 సిక్స్‌లతో 174) సెంచరీతో పరుగుల సునామీ సృష్టించగా.. హెన్రీచ్ క్లాసెన్(48 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్స్‌లతో 90 ) ఊర మాస్ బ్యాటింగ్‌తో అలరించాడు.

ఈ ఇద్దరి విధ్వంసానికి తోడుగా ఎయిడెన్ మార్క్‌రమ్(69 బంతుల్లో 7 ఫోర్లతో 60), డేవిడ్ మిల్లర్(15 బంతుల్లో ఫోర్, 4 సిక్స్‌లతో 34 నాటౌట్) కీలక ఇన్నింగ్స్‌లతో రాణించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో హసన్ మహముద్ రెండు వికెట్లు తీయగా.. మెహ్‌దీ హసన్ మీరాజ్, షోరిఫుల్ ఇస్లామ్, షకీబ్ అల్ హసన్ తలో వికెట్ తీసారు

అనంతరం లక్ష్యచేధనకు దిగిన బంగ్లాదేశ్ 46.4 ఓవర్లలో 233 పరుగులకు కుప్పకూలింది. మహ్మదుల్లా(111) ఒక్కడే సెంచరీతో రాణించాడు. సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సెన్(2/39), లిజాడ్ విలియమ్స్(2/56), కగిసో రబడా(2/42) రెండేసి వికెట్లు తీయగా.. గెరాల్డ్ కోయిట్జీ(3/63) మూడు వికెట్లు తీసాడు.
భారీ లక్ష్యచేధనకు దిగిన బంగ్లాదేశ్ 81 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో మహ్మదుల్లా ఒంటరి పోరాటం చేశాడు. మరోవైపు వరుసగా వికెట్లు పడినా.. అసాధారణ బ్యాటింగ్‌తో సెంచరీ సాధించడంతో జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు.