SA vs AUS 2nd semi final: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా సౌతాఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో సెమీఫైనల్ మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది. వర్షం అంతరాయం కలిగించడంతో అంపైర్లు కాసేపు ఆటను ఆపేసారు. వర్షం ఆగిపోవడం.. మైదాన సిబ్బంది గ్రౌండ్‌ను సిద్దం చేయడంతో తిరిగి ప్రారంభించారు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికాకు బిగ్ షాక్ తగిలింది. మిచెల్ స్టార్క్ వేసిన తొలి ఓవర్‌లోనే కెప్టెన్ టెంబా బవుమా(0) డకౌటవ్వగా.. ఆచితూచి ఆడే ప్రయత్నం చేసిన క్వింటన్ డికాక్(3)ను హజెల్ వుడ్ పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చిన ఎయిడెన్ మార్క్‌రమ్(10)ను స్టార్క్ పెవిలియన్ చేర్చగా.. రాసీ వాన్ డెర్ డస్సెన్(6) హజెల్ వుడ్ ఔట్ చేశాడు. దాంతో సౌతాఫ్రికా 24 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

క్రీజులోకి వచ్చిన డేవిడ్ మిల్లర్, హెన్రీచ్ క్లాసెన్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. వర్షం అంతరాయం సౌతాఫ్రికా బ్యాటర్లపై మరింత ఒత్తిడిని పెంచుతోంది. తక్కువ స్కోర్‌కే టాప్-4 బ్యాటర్లు కోల్పోయి తీవ్ర ఒత్తిడిలో ఉన్న సౌతాఫ్రికాకు వర్షం భయం పట్టుకుంది. భారీ వర్షం మ్యాచ్ ఆగిపోతే.. డక్ వర్త్ లూయిస్ ప్రకారం మ్యాచ్ నిర్వహించాల్సి ఉంటుంది.
ఇందుకు ఇరు జట్లు కనీస 20 ఓవర్లు ఆడితే సరిపోతుంది. సౌతాఫ్రికా తొలి 14 ఓవర్లలో వికెట్లు కోల్పోయి పరుగులేమి చేయలేదు. ఈ లెక్కన ఆటకు అంతరాయం కలిగితే ఆసీస్ ముందు స్వల్ప లక్ష్యం నమోదవుతోంది. ఇప్పుడు ఇదే భయం సౌతాఫ్రికాను వెంటాడుతోంది. సెమీస్ అంటే అనవసరం ఒత్తిడికి గురయ్యే సౌతాఫ్రికా ఈ మ్యాచ్‌లోనూ అదే తడబాటును కొనసాగిస్తోంది.