టాస్ ఓడిపోవడంతో పాటు చెత్త బ్యాటింగ్ తమ ఓటమిని శాసించిందని అఫ్గానిస్థాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది అన్నాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా శుక్రవారం కరాచీ వేదికగా ఏక పక్షంగా సాగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా 107 పరుగుల భారీ తేడాతో అఫ్గానిస్థాన్‌ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన హష్మతుల్లా షాహిది.. స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయామని అంగీకరించాడు.
'బ్యాటింగ్‌లో మేం దారుణంగా విఫలమయ్యాం. రెండో ఇన్నింగ్స్‌లో పిచ్ సౌతాఫ్రికా బౌలర్లకు అనుకూలంగా మారిపోయింది. కానీ తొలి 20 ఓవర్లలో మా బ్యాటింగ్ స్థాయికి తగ్గట్లు లేదు. ఈ మ్యాచ్‌లో టాస్ కీలక పాత్ర పోషించింది. పిచ్‌పై చాలా పగుళ్లు ఉన్నాయి. ఇది సాధారణంగా ఉండే కరాచీ పిచ్ కాదు. సఫారీ బౌలర్లు సరైన లెంగ్త్‌లో బౌలింగ్ చేశారు. మెరుగైన ప్రదర్శన చేయడమే మా లక్ష్యం.
ఇప్పటికే మేం చాలా సాధించాం.

ఎక్కడైనా పోరాడే సామర్థ్యం మాకు ఉంది. మాకు ఇంకా కీలకమైన మ్యాచ్‌లు ఉన్నాయి. ఈ రోజు ఫలితాన్ని మేం మరిచిపోయి ముందుకు సాగుతాం. రహమత్ షా అద్భుతంగా ఆడాడు. కఠిన సమయంలో ఆడిన ఇన్నింగ్స్ అతనిది. మేం ఈ మ్యాచ్‌లోని సానుకూలంశాలు తీసుకొని ముందుకు సాగుతాం. క్వాలిటీ క్రికెట్ ఆడేందుకు మాకు ఇంకా అవకాశం ఉంది.'అని హష్మతుల్లా షాహిది చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 315 పరుగుల భారీ స్కోర్ చేసింది. ర్యాన్ రికెల్టన్(106 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 103) సెంచరీతో చెలరేగగా.. టెంబా బవుమా(76 బంతుల్లో 5 ఫోర్లతో 58), రాసీ వాన్ డెర్ డస్సెన్(46 బంతుల్లో3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 52), ఎయిడెన్ మార్క్‌రమ్(36 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 52 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు.
అఫ్గానిస్థాన్ బౌలర్లలో మహమ్మద్ నబీ(2/51) రెండు వికెట్లు తీయగా.. ఫజలక్ ఫరూఖీ, అజ్మతుల్లా ఒమర్జాయ్ తలో వికెట్ తీసారు. అనంతరం అఫ్గానిస్థాన్ 43.3 ఓవర్లలో 208 పరుగులకు కుప్పకూలింది. కగిసో రబడా(3/36) మూడు వికెట్లు తీయగా.. లుంగి ఎంగిడి(2/56), వియాన్ మల్డర్(2/36) రెండేసి వికెట్లు పడగొట్టారు. మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్ తలో వికెట్ తీసారు. అఫ్గాన్ బ్యాటర్లలో రహ్మత్ షా(92 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్‌తో 90) మినహా మరెవరూ రాణించలేదు.