టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్‌తో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విలువ పెరుగుతుందని, కానీ అతను రూ. 10 కోట్ల ఆటగాడు కాదని మాజీ క్రికెటర్ ఎస్ బద్రీనాథ్ అన్నాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో అశ్విన్ తన ప్రైజ్ ట్యాగ్‌కు న్యాయం చేయలేకపోయాడని చెప్పాడు. అతన్ని చెన్నై సూపర్ కింగ్స్ వదిలేయడమే ఉత్తమమని అభిప్రాయపడ్డాడు.
ఐపీఎల్ 2025 మెగా వేలంలో అశ్విన్‌ను చెన్నై సూపర్ కింగ్స్ రూ. 9.75 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. కానీ అతను 9 మ్యాచ్‌లు ఆడి 9.13 ఎకానమీతో 7 వికెట్లు మాత్రమే తీసాడు. ఈ ప్రదర్శన నేపథ్యంలో ఐపీఎల్ 2026కి ముందు అశ్విన్‌ను చెన్నై సూపర్ కింగ్స్ వదిలేస్తుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అంతేకాకుండా సీఎస్‌కేను వదిలేందుకు అశ్విన్ కూడా సిద్దమయ్యాడని వార్తలు వచ్చాయి. జట్టులో తన రోల్ ఏంటో చెప్పాలని సీఎస్‌కే యాజమాన్యాన్ని అశ్విన్ కోరినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే సీఎస్‌కే అతన్ని రిటైన్ చేసుకుంటుందా? లేక వేలంలోకి వదిలేస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది.

తాజాగా ఈ వ్యవహారంపై స్పందించిన బద్రీనాథ్.. అశ్విన్ వదిలేయడమే ఉత్తమమని అభిప్రాయపడ్డాడు. అశ్విన్ తన ప్రైజ్ ట్యాగ్‌కు న్యాయం చేయలేకపోయాడని చెప్పాడు. 'అశ్విన్ సీఎస్‌కేకు విలువ తీసుకొస్తాడు. కానీ అతను రూ. 10 కోట్ల(రూ.9.75 కోట్లు) ఆటగాడైతే కాదు. ఐపీఎల్‌లో ఆటగాడి ధరను, ఆటను పోల్చి చూడాలి. ప్రస్తుతం అశ్విన్ అయితే తన పీక్ ఫామ్‌లో లేడు. అందుకే అశ్విన్‌ను వదిలేయాలని నేను మొదటి నుంచి చెబుతున్నా.
ఎంఎస్ ధోనీ జట్టులో కొనసాగుతాడా? లేక తప్పుకుంటాడా? అనేది తెలియదు. ఆ నిర్ణయం ఇంకా తీసుకోలేదు. అతను కొన్ని మ్యాచ్‌లు ఆడవచ్చు. లేదంటే చెపాక్ వేదికగా జరిగే మ్యాచ్‌లు మాత్రమే ఆడవచ్చు. ధోనీ రిటైర్మెంట్ బ్రాండ్ విలువపై ఆధారపడి ఉండొచ్చు. అతను ఉంటే ఫ్రాంచైజీ ఇంకొన్ని బ్రాండ్లను ఆకర్షించవచ్చు. ఐపీఎల్ సీజన్ ప్రారంభమయ్యేలోపు ధోనీ తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. సంజూ శాంసన్ రాకతో జట్టులో గందరగోళం నెలకొంటుంది.'అని బద్రీనాథ్ చెప్పుకొచ్చాడు.
ఇక సంజూ శాంసన్.. రాజస్థాన్ రాయల్స్‌ను వీడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అతనికి చెన్నై సూపర్ కింగ్స్ నుంచి ఆఫర్ వచ్చిందని, ధోనీ వారసుడిగా జట్టులోకి వచ్చేందుకు సిద్దమయ్యాడని ప్రచారం జరుగుతోంది. సీఎస్‌కే, రాజస్థాన్ రాయల్స్ మధ్య ట్రేడింగ్ డీల్‌పై చర్చలు జరుగుతున్నాయని, సంజూ శాంసన్‌కు బదులు ఇద్దరు ప్లేయర్లను ఇవ్వాలని రాజస్థాన్ రాయల్స్ డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. మరోవైపు సంజూ శాంసన్ రాకతో జట్టులో గందరగోళం నెలకొంటుందని ఆ జట్టు ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.