టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీకి 'కెప్టెన్ కూల్'అనే బిరుదు ఉంది. మైదానంలో పరిస్థితులతో సంబంధం లేకుండా చాలా ప్రశాంతంగా ఉంటూ నిర్ణయాలు తీసుకోవడంలో ధోనీ దిట్ట. ఎలాంటి పరిస్థితుల్లోనూ ధోనీ తన భావోద్వేగాలను బయటపెట్టడు. గెలిచినా.. ఓడినా సంయనంతో ఉంటాడు. దాంతోనే ధోనీని అందరూ మిస్టర్ కూల్ అని పిలుస్తుంటారు.
మైదానంలో ధోనీ ఆగ్రహానికి గురైన సందర్భాలు చాలా అరుదు. సహచర ఆటగాళ్లపై ధోనీ కోప్పడిన ఘటనలు కూడా లేవు. తన సుదీర్ఘ కెరీర్‌లో ధోనీ రెండే రెండు సార్లు అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. ఇంతకు మించి అతను ఆగ్రహానికి గురైన సంఘటనలు లేవు. వివాదరహితుడిగా అతనికి మంచి పేరు ఉంది.

ఈ తరహా శైలితోనే ధోనీ టీమిండియాకు మూడు ఐసీసీ టైటిళ్లు అందించాడు. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ టైటిళ్లను భారత్ ధోనీ సారథ్యంలోనే గెలిచింది. ఐపీఎల్‌లోనూ చెన్నై సూపర్ కింగ్స్‌కు ధోనీ సారథిగా ఐదు టైటిళ్లు అందించాడు. అయితే ధోనీ కూడా ఆగ్రహానికి గురవుతాడని, ఐపీఎల్ ఆరంభంలో అతని కోపాన్ని దగ్గరి నుంచి చూశానని టీమిండియా మాజీ క్రికెటర్ ఎస్ బద్రీనాథ్ తెలిపారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ధోనీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 'ధోనీ కూడా సాధారణమైన మనిషే. అతనూ అప్పుడప్పుడూ సంయమనాన్ని కోల్పోతూ ఉంటాడు. కానీ, మైదానంలో తన ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం చాలా అరుదు. కోపం ప్రదర్శించడం వల్ల నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నట్లు ప్రత్యర్థులు భావించకూడదని ధోనీ ఆలోచన. కానీ ఐపీఎల్ ప్రారంభంలో ఆర్‌సీబీతో మ్యాచ్ సందర్భంగా ధోనీ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు.
అతని ఉగ్రరూపాన్ని నేను ప్రత్యక్షంగా చూశాను. అయితే ఇది డ్రెస్సింగ్ రూమ్‌లో జరిగింది. చెన్నై వేదికగా ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో మేం 110 పరుగుల లక్ష్యచేధనకు దిగాం. స్వల్ప వ్యవధిలోనే వికెట్లు కోల్పోయి మ్యాచ్‌లో ఓడిపోయాం. అనిల్ కుంబ్లే బౌలింగ్‌లో షాట్ ఆడబోయి ఎల్బీగా పెవిలియన్ చేరాను. డ్రెస్సింగ్ రూమ్ పక్కనే నిల్చోని ఉన్నా. అప్పుడు ధోనీ వస్తున్నాడు. అక్కడ ఉన్న ఓ చిన్న వాటర్ బాటిల్‌ను పట్టరాని కోపంతో తన్నేశాడు. ఆ సమయంలో కనీసం అతని కళ్లల్లోకి చూసేందుకు కూడా భయపడ్డాను.'అని బద్రీనాథ్ చెప్పుకొచ్చాడు.