ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) అభిమానులకు బిగ్ షాక్. ఆ జట్టు సారథ్య బాధ్యతల నుంచి మహేంద్ర సింగ్ ధోనీ తప్పుకున్నాడు. దాంతో సీఎస్‌కే నూతన సారథిగా రుతురాజ్ గైక్వాడ్‌ను ఎంపిక చేసింది. ఈ విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ అధికారికంగా వెల్లడించింది.
మహేంద్ర సింగ్ ధోనీ తన సారథ్య బాధ్యతలను రుతురాజ్ గైక్వాడ్‌కు అందించాడని ప్రకటించింది. ఐపీఎల్ 2024 సీజన్ నేపథ్యంలో ధోనీ ఈ నిర్ణయం తీసుకున్నాడని తెలిపింది. ఐపీఎల్ 2019 సీజన్ నుంచి చెన్నైకి ఆడుతున్న రుతురాజ్ గైక్వాడ్ ఇప్పటి వరకు 52 మ్యాచ్‌లు ఆడాడని తమ ప్రకటనలో ప్రస్తావించింది. ధోనీ అందుబాటులో ఉండే విషయంపై ఎలాంటి విషయాన్ని వెల్లడించలేదు.
ఐపీఎల్ 2024 ట్రోఫీ ఫొటో షూట్‌లో 10 ఫ్రాంచైజీల కెప్టెన్లు పాల్గొన్నారు. కాసేపటి క్రితమే ఈ ట్రోఫీ షూట్‌కు సంబంధించిన ఫొటోలను ఐపీఎల్ నిర్వాహకులు అభిమానులతో పంచుకున్నారు. ఇందులో ధోనీకి బదులు రుతురాజ్ గైక్వాడ్ ఫోజివ్వడంతో అంతా అవాక్కయ్యారు. ఆ వెంటనే ఐపీఎల్ నిర్వాహకులు ధోనీ తన సారథ్య బాధ్యతలను రుతురాజ్ గైక్వాడ్‌కు అప్పగించాడని వివరణ ఇచ్చారు.

కొద్ది రోజుల క్రితమే కొత్త సీజన్‌లో కొత్త పాత్రలో కనిపించబోతున్నానని ధోనీ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశాడు. అందుకు తగ్గట్లుగానే అతను సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. దాంతో ఈ సీజన్‌లో అతను పూర్తి స్థాయిలో బరిలోకి దిగుతాడా? లేక ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగుతాడా? అనేది తెలియాల్సి ఉంది. లేకుంటే ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించి మెంటార్‌గా కొనసాగుతాడా? అనేది చూడాలి.
ధోనీ సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ 5 టైటిళ్లు గెలిచింది. అత్యధికసార్లు ప్లే ఆఫ్స్ చేరిన జట్టుగా కూడా చరిత్రకెక్కింది. ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలం అనంతరం ధోనీ.. తన సారథ్య బాధ్యతలను జడేజాకు అందజేశాడు. ఈ ప్రయోగం మిస్‌ఫైర్ అవ్వడంతో మధ్యలోనే మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టాడు. ఆ సీజన్‌లో చెన్నై దారుణంగా విఫలమైనా.. మరుసటి ఏడాది ధోనీ సారథ్యంలో టైటిల్ గెలిచింది. మరోసారి సారథ్య బాధ్యతలను వదులుకోవడంతో ఈ సీజన్‌లో కూడా చెన్నైకి గడ్డు పరిస్థితులు ఎదురవుతాయని ఫ్యాన్స్ ఆందోళనకు గురవుతున్నారు.