వరుసగా వికెట్లు కోల్పోవడంతోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) చేతిలో ఓటమి పాలయ్యామని చెన్నై సూపర్ కింగ్స్ సారథి రుతురాజ్ గైక్వాడ్ తెలిపాడు. చిన్నస్వామి స్టేడియం వేదికగా 200 పరుగుల లక్ష్యాన్ని చేధించడం పెద్ద కష్టమేమి కాదన్నాడు. గాయాలతో ఫ్రంట్ లైన్ బౌలర్లు దూరమవ్వడంతోనే ప్లే ఆఫ్స్ చేరలేకపోయామని చెప్పాడు.
ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా ఆర్‌సీబీతో శనివారం జరిగిన కీలక పోరులో సీఎస్‌కే 27 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 219 పరుగుల లక్ష్య చేధనలో ప్లే ఆఫ్స్ చేరాలంటే సీఎస్‌కే 200 పరుగులు చేయాల్సి ఉండగా.. 191 రన్స్ చేసి టోర్నీ నుంచి నిష్క్రమించింది.

గెలవాల్సిన మ్యాచ్..
ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన రుతురాజ్ గైక్వాడ్.. ప్లే ఆఫ్స్ చేరకపోవడం నిరాశకు గురి చేసినా.. తమ జట్టు ప్రదర్శన పట్ల సంతృప్తిని వ్యక్తం చేశాడు. 'నిజాయితీగా చెప్పాలంటే ఈ వికెట్ చాలా బాగుంది. బంతి టర్న్ అవ్వడంతో పాటు కొంచెం ఆగుతూ వచ్చింది. అయినా ఈ వికెట్‌పై 200 పరుగులు ఛేదించాల్సిన లక్ష్యమే. కానీ మేం వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయాం.
రెండు, మూడు భారీ షాట్లు ఆడితే ఈ లక్ష్యాన్ని అందుకోవచ్చు. కొన్నిసార్లు టీ20 క్రికెట్‌లో ఇలానే జరుగుతుంది. ఈ సీజన్‌లో మా జట్టు ప్రదర్శన సంతోషాన్నిచ్చింది. 14 మ్యాచ్‌ల్లో ఏడు విజయాలు సాధించాం. చివరి రెండు బంతుల్లో లక్ష్యాన్నిఅందుకోలేకపోయాం. ఓవైపు గాయాల బెడద వెంటాడినా.. ఇద్దరూ ఫ్రంట్ లైన్ బౌలర్లు దూరమైనా.. టాపార్డర్‌లో డెవాన్ కాన్వే లేకున్నా.. మేం ఈ సీజన్‌లో అసాధారణ ప్రదర్శన కనబర్చాం.
దెబ్బతీసిన గాయాలు..
తొలి మ్యాచ్ నుంచే మాకు అనేక సవాళ్లు ఎదురయ్యాయి. ఆరంభంలో ముస్తాఫిజుర్ రెహ్మాన్ గాయపడ్డాడు. అతను తుది జట్టులోకి రాగానే పతీరణ దూరమయ్యాడు. కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడితే సరైన టీమ్ కాంబినేషన్‌ను ఎంచుకోవడం చాలా కష్టం. జట్టు సమతూకం దెబ్బతింటుంది. అయితే ఆటగాళ్ల గాయాలు, అనారోగ్య సమస్యల మధ్య కూడా ఈ సీజన్‌లో మేం రాణించాం.
ఏడు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాం. కానీ ప్లే ఆఫ్స్ బెర్త్‌ను అందుకోలేకపోయాం. అయినా సంతోషంగానే ఉంది. గత సీజన్ నాకౌట్ గేమ్‌లో మాకు చివరి 2 బంతుల్లో 10 పరుగులు అవసరమయ్యాయి. ఈ సారి అలాంటి పరిస్థితే ఎదురైంది. కానీ ఈ సీజన్‌లో మేం ఆశించిన ఫలితం దక్కలేదు. నా దృష్టిలో వ్యక్తిగత ప్రదర్శనలకు ప్రాధాన్యత లేదు.
గెలవనప్పుడు సెంచరీలు ఎందుకు..?
జట్టు విజయమే ప్రధాన లక్ష్యం. విజయం దక్కనప్పుడు నిరాశగానే ఉంటుంది. సెంచరీ చేసినా.. ఈ సీజన్‌లో 500-600 పరుగులు చేసినా.. విజయం దక్కనప్పుడు సంతోషంగా ఉండలేం.'అని రుతురాజ్ గైక్వాడ్ చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 218 పరుగులు చేసింది.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 191 పరుగులు చేసి ఓటమిపాలైంది. మరో 9 పరుగులు చేసుంటే సీఎస్‌కే ప్లే ఆఫ్స్ చేరేది.