ఓ క్యాచ్ వదిలేయడంతో పాటు పవర్ ప్లేలో ధారళంగా పరుగులు ఇవ్వడం తమ ఓటమిని శాసించిందని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తెలిపాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఉప్పల్ వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.
ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన రుతురాజ్ గైక్వాడ్.. పిచ్ కండిషన్స్ తమ విజయవకాశాలను దెబ్బతీసాయన్నాడు. 'నిజాయితీగా చెప్పాలంటే ఇది చాలా స్లో పిచ్. సన్‌రైజర్స్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. మ్యాచ్‌పై పట్టు సాధించిన సన్‌రైజర్స్ ఎలాంటి అవకాశం ఇవ్వకుండా సత్తా చాటారు. ఆరంభంలో మేం సత్తా చాటినా.. తర్వాత విఫలమయ్యాం. ఇది బ్లాక్ సాయిల్ పిచ్. వికెట్ చాలా స్లోగా ఉంటుందని ముందుగానే ఊహించాం.

కానీ మేం ఊహించినదాని కంటే చాలా స్లోగా ఉంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌండరీల సైజ్‌ను అద్భుతంగా ఉపయోగించుకుంది. పవర్ ప్లేలో మేం ధారళంగా పరుగులిచ్చుకున్నాం. క్యాచ్ నేలపాలు చేయడం.. ఒక ఓవర్‌లో ధారళంగా పరుగులు ఇచ్చుకోవడం కూడా మా విజయవకాశాలను దెబ్బతీసింది.
అయినా మేం 19వ ఓవర్ వరకు మ్యాచ్ తీసుకెళ్లాం. మేం 170-175 పరుగులు చేసుంటే ఫలితం మరోలా ఉండేది. తక్కువ స్కోర్ చేసినా మోయిన్ అలీ అద్భుతంగా బౌలింగ్ చేశాడు.'అని రుతురాజ్ గైక్వాడ్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 165 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా(24 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 45), అజింక్యా రహానే(30 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 35) టాప్ స్కోరర్లుగా నిలిచారు. సన్‌రైజర్స్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, టీ నటరాజన్, ప్యాట్ కమిన్స్, షెహ్‌బాజ్ అహ్మద్, జయదేవ్ ఉనాత్కత్ తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 18.1 ఓవర్లలో 4 వికెట్లకు 166 పరుగులు చేసింది. ఎయిడెన్ మార్క్‌రమ్‌తో పాటు ట్రావిస్ హెడ్(24 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 31), అభిషేక్ శర్మ(12 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 37) మెరుపులు మెరిపించారు. చెన్నై బౌలర్లలో దీపక్ చాహర్, మహీష్ తీక్షణ తలో వికెట్ తీయగా.. మోయిన్ అలీ రెండు వికెట్లు పడగొట్టాడు.