
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నుంచి తానెంతో నేర్చుకున్నానని యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ అన్నాడు. జట్టు గెలుస్తున్నప్పుడు అతిగా స్పందించకపోవడం.. భావోద్వేగాలను నియంత్రించుకొని.. న్యూట్రల్‌గా ఉండటాన్ని చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడే సమయంలో ధోనీ దగ్గర్నుంచి నేర్చుకున్నానని తెలిపాడు. టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా యూట్యూబ్ ఛానెల్‌తో మాట్లాడిన రుతురాజ్ గైక్వాడ్.. జట్టు ఓడినా సరే డ్రెస్సింగ్ రూమ్‌లో ధోనీ సానుకూల దృక్పథాన్ని నింపడానికి ప్రయత్నించేవాడని తెలిపాడు.
ధోనీ సపోర్ట్‌తో క్లిష్ట పరిస్థితుల్లోనూ జట్టు ఏకతాటిపై ఉండేదని.. టీమ్ స్పిరిట్ పెరగడానికి మహీ సాయం చేసేవాడని రుతురాజ్ చెప్పాడు. 'మ్యాచ్ ఓడిన తర్వాత ప్రతి ఒక్కరూ 15 నిమిషాలపాటు సైలెంట్ అయిపోయేవారు. కానీ మహీ భాయ్ ప్రజెంటేషన్ నుంచి తిరిగొచ్చాక మమ్మల్ని సౌకర్యవంతంగా ఉంచేవాడు. 'రిలాక్స్ బాయ్స్, ఇలా జరుగుతుంది' అనేవాడు. మేం గెలిచినా ఓడినా జట్టు స్ఫూర్తి ఒకేలా ఉండేలా ధోనీ చూసేవాడు. ఓడితే ఎంతగానో నిరాశకు లోనయ్యేవాళ్లం. కానీ నెగటివిటీ, ఒకరిని నిందించడం ఉండేది కాదు'' అని ధోనీ కెప్టెన్సీ గురించి రుతురాజ్ కొనియాడాడు.
ధోనీ వైఖరి తనను ఎంతో ఇంప్రెస్ చేసిందన్న గైక్వాడ్.. గెలుపోటములతో సంబంధం లేకుండా జట్టు వాతావరణం ఒకేలా ఉండేలా మహీ జాగ్రత్త పడేవాడన్నాడు. 'ఓటములు ఎదురవుతున్నప్పుడు టీమ్‌లోనే రకరకాల గ్రూప్‌లు ఏర్పడుతుంటాయి. కానీ చెన్నై సూపర్ కింగ్స్‌లో ధోనీ అలా జరగనీయలేదు.'అని గైక్వాడ్ వెల్లడించాడు. 'మ్యాచ్ అనంతరం ధోనీ జరిపే సమావేశాలు చాలా తక్కువ సేపు ఉంటాయి. ఓడినా సరే.. సుదీర్ఘ సమావేశం అంటే రెండు లేదా మూడు నిమిషాలు ఉంటుందంతే. ఇప్పుడు మనకు డిన్నర్ ప్లాన్ ఉంది. కాబట్టి అంతా దాని కోసం రెడీ అయి వచ్చేయండి అని ధోనీ మాతో చెప్పేవాడు. చెన్నై సూపర్ కింగ్స్ ప్రతిసారి గెలవడం సాధ్యం కాదని మాకు అర్థమయ్యేలా చెప్పేవాడు.'అని గైక్వాడ్ చెప్పుకొచ్చాడు.
ఇక విజయ్ హజారే ట్రోఫీలో రుతురాజ్ గైక్వాడ్ వరల్డ్ రికార్డు నమోదు చేశాడు. ఒకే ఓవర్‌లో నోబాల్‌తో సహా వరుసగా 7 సిక్స్‌లు బాదాడు. ఈ టోర్నీలో మహారాష్ట్రకు ప్రాతినిథ్యం వహిస్తున్న రుతురాజ్.. ఉత్తర్ ప్రదేశ్‌తో అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న రెండో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఈ ఫీట్ సాధించాడు. యూపీ బౌలర్ శివా సింగ్ వేసిన 49వ ఓవర్‌లో రుతురాజ్ ఈ ఘనతను అందుకున్నాడు.