చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) సారథ్య బాధ్యతల నుంచి మహేంద్ర సింగ్ ధోనీ తప్పుకోవడాన్ని చాలా మంది అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. వయసు మీద పడటంతో 42 ఏళ్ల ధోనీ తన కెప్టెన్సీ బాధ్యతలను యువ ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్‌కు అప్పగించి ఐపీఎల్ 2024 సీజన్‌లో వికెట్ కీపర్‌గా కొనసాగాడు.
మరోవైపు ధోనీ చివరి ఐపీఎల్ సీజన్ ఆడాడని, వచ్చే సీజన్‌కు అందుబాటులో ఉండడని జోరుగా ప్రచారం జరుగుతోంది. ధోనీ మాత్రం తన రిటైర్మెంట్‌పై ఎలాంటి ప్రకటన చేయలేదు. కనీసం సీఎస్‌కే మేనేజ్‌మెంట్‌కు కూడా సమాచారం ఇవ్వలేదు. కానీ వచ్చే ఏడాది మెగా వేలం జరగనున్న నేపథ్యంలో ధోనీ కొనసాగడం కష్టమే అనిపిస్తోంది. ఒకవేళ ధోనీ దూరమైతే అతని స్థానాన్ని ఎవరు భర్తీ చేయగలరు? అనేది ప్రశ్నగా మిగిలిపోయింది.

కానీ ధోనీ స్థానాన్ని భర్తీ చేసే వికెట్ కీపర్ సీఎస్‌కే జట్టులోనే ఉన్నాడు. తమ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడే వికెట్ కీపర్‌గా ధోనీ స్థానాన్ని భర్తీ చేయగలడు. తాజాగా రుతురాజ్ గైక్వాడ్ వికెట్ కీపింగ్‌కు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ వీడియోపై సీఎస్‌కే ఫ్యాన్స్ ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. తమకు ధోనీ రీప్లేస్‌మెంట్ దొరికేసాడని పేర్కొంటున్నారు.
మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్‌లో పుణేరి బప్పా కెప్టెన్‌గా కొనసాగుతున్న రుతురాజ్ గైక్వాడ్ తాజాగా ఛత్రపతి సాంబాజీ కింగ్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో వికెట్ కీపింగ్ చేశాడు. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్ గ్లోవ్స్ ధరించి ధోనీ తరహాలో డైవ్ చేసి మరి బంతిని అందుకున్నాడు.
ఈ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో బౌలర్ వైడ్ వేయగా.. గైక్వాడ్ కుడివైపు డైవ్ చేసి బంతిని అందుకున్నాడు. దాంతో ధోనీ స్థానాన్ని రుతురాజ్ గైక్వాడ్ భర్తీ చేయగలడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
ఐపీఎల్‌లో 2024 సీజన్‌లో సీఎస్‌కే ప్లే ఆఫ్స్ చేరకుండానే ఇంటి దారిపట్టింది. కీలక సమయంలో ఆటగాళ్లు గాయపడటం ఆ జట్టు కొంపముంచింది. ఆర్‌సీబీ తప్పక గెలవాల్సిన చివరి లీగ్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఓటమిపాలైంది. దాంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది.