లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్‌పై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఐపీఎల్ 2026 సీజన్‌లో రిషభ్ పంత్ దారుణంగా విఫలమవుతున్నాడు. మ్యాచ్ మ్యాచ్‌కు అతని ప్రదర్శన దిగజారుతుందే తప్పా మెరుగవ్వడం లేదు. అటు బ్యాటింగ్, ఇటు కెప్టెన్సీలోనూ తడబడుతూ జట్టు ఓటమికి కారణమవుతున్నాడు. దాంతో సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నాడు.
ఇప్పటి వరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో రిషభ్ పంత్ 24.50 సగటు, 128.30 స్ట్రైక్‌రేట్‌తో 204 పరుగులే చేశాడు. ముఖ్యంగా జట్టుకు అవసరమైన సందర్భంలో చేతులెత్తేస్తున్నాడు. సోమవారం వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లో రిషభ్ పంత్ బ్యాటింగ్ వైఫల్యం లక్నో సూపర్ జెయింట్స్ విజయవకాశాలను దెబ్బతీసింది.
నికోలస్ పూరన్, మిచెల్ మార్ష్ అందించిన విధ్వంసకర ఆరంభాన్ని పంత్ కొనసాగించలేకపోయాడు. అతని వైఫల్యం ఇతర బ్యాటర్లపై ప్రభావం చూపింది. దాంతో 240+ రన్స్ చేయాల్సిన లక్నో సూపర్ జెయింట్స్ 229 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది.

ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర రూ.27 కోట్లు పెట్టిన కొనుగోలు చేసిన సంజీవ్ గోయెంకాను రిషభ్ పంత్ నట్టేట ముంచుతున్నాడు. ఐపీఎల్ 2025 సీజన్‌తో పాటు ఈ సీజన్‌లోనూ పంత్ దారుణంగా విఫలమయ్యాడు. ఈ క్రమంలోనే రిషభ్ పంత్‌ను జట్టు నుంచి తప్పించాలని సంజీవ్ గోయెంకాకు నెటిజన్లు విజ్ఞప్తి చేస్తున్నారు. పంత్‌ను వదిలేస్తేనే లక్నో దరిద్రం వదులుతుందని అభిప్రాయపడుతున్నారు.
కొందరైతే తన ఆటకు.. తీసుకునే డబ్బులకు ఏ మాత్రం పొంతన లేదని లెక్కలు కడుతూ విమర్శలు గుప్పిస్తున్నారు. రిషభ్ పంత్ ఒక్క సీజన్‌కు తీసుకునే రూ.27 కోట్ల వేతనాన్ని మ్యాచ్‌లు వారిగా విభజించి పరుగులతో లెక్కిస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఒక్కో ఐపీఎల్ మ్యాచ్‌కు రిషభ్ పంత్‌కు రూ.1.92 కోట్ల వేతనం లభిస్తుంది. ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు జరగ్గా.. 19.28 కోట్లు అతని ఖాతాలో చేరింది. ఇంత డబ్బు తీసుకొని అతను ఈ 9 మ్యాచ్‌ల్లో చేసిన పరుగులు 204 మాత్రమే. అంటే అతను చేసిన ఒక్కో పరుగు విలువ అక్షరాల రూ.8.5 లక్షలు.
ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ నెటిజన్లు పంత్‌పై మండిపడుతున్నారు. నీ ఒక్కో పరుగు విలువతో చిన్నపాటి ఇళ్లు కట్టుకోవచ్చని కొందరు సెటైర్లు పేల్చితే.. మరికొందరు పంత్ వల్ల గోయెంకా సర్‌కు గోచి కూడా మిగిలేలా లేదని ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.
నోట్: ఐపీఎల్ వేతనాలు మ్యాచ్‌లతో సంబంధం ఉండదు. లీగ్‌లో ఎన్ని మ్యాచ్‌లు ఆడినా వేలంలో పలికిన ధర మొత్తం ఆటగాళ్లకు అందుతుంది. రిషభ్ పంత్ అత్యధిక ధరను ప్రస్తావిస్తూ నెటిజన్లు సరదాగా ఒక్కో మ్యాచ్, పరుగు లెక్క కట్టి విమర్శలు గుప్పిస్తున్నారు.