ఐపీఎల్ 2025 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు( ఆర్‌సీబీ) మరో విజయాన్నందుకుంది. సొంతగడ్డపై తడబడుతున్నఆర్‌సీబీ.. ప్రత్యర్థి వేదికలపై తమ జైత్రయాత్రను కొనసాగిస్తోంది. రాజస్థాన్ రాయల్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ఆర్‌సీబీ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. పర్యావరణ పరిరక్షణ క్యాంపెయిన్‌లో భాగంగా ఈ మ్యాచ్‌ను గ్రీన్ జెర్సీలో ఆడిన ఆర్‌సీబీ.. తమ రికార్డ్‌ను మెరుగుపరుచుకుంది. గ్రీన్ జెర్సీలో ఐదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. మరోవైపు చెత్త ఫీల్డింగ్‌తో రాజస్థాన్ రాయల్స్ విజయవకాశాలను చేజార్చుకుంది. 6 క్యాచ్‌లతో పాటు ఒక రనౌట్ అవకాశాన్ని చేజార్చకొని మూల్యం చెల్లించుకుంది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 173 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్(47 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లతో 75) హాఫ్ సెంచరీతో రాణించగా.. రియాన్ పరాగ్(22 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 30), ధ్రువ్ జురెల్(23 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 35 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఆర్‌సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, జోష్ హజెల్ వుడ్, కృనాల్ పాండ్యా తలో వికెట్ తీసారు.
అనంతరం ఆర్‌సీబీ 17.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 175 పరుగులు చేసి గెలుపొందింది. విరాట్ కోహ్లీ(45 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 62 నాటౌట్), ఫిల్ సాల్ట్(33 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో 65) హాఫ్ సెంచరీలతో రాణించారు. దేవదత్ పడిక్కల్(28 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 40 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో కుమార్ కార్తీకేయ ఒక్కడే వికెట్ తీసాడు.

కొంపముంచిన రియాన్ పరాగ్..
లక్ష్యచేధనలో ఆర్‌సీబీకి ఓపెనర్లు ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. తొలి ఓవర్‌లోనే సిక్స్ బాది ఫిల్ సాల్ట్ తన దూకుడు మొదలు పెట్టాడు. అయితే జోఫ్రా ఆర్చర్‌లో అతను ఇచ్చిన కష్టతరమైన క్యాచ్‌ను బౌండరీ లైన్ వద్ద హెట్‌మైర్ అందుకోలేకపోయాడు. సందీప్ శర్మ వేసిన మరుసటి ఓవర్‌లో కోహ్లీ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను రియాన్ పరాగ్ నేలపాలు చేశాడు. అప్పటికీ విరాట్ కోహ్లీ చేసింది 7 పరుగులు మాత్రమే. ఈ క్యాచ్ డ్రాప్ మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది.
అదే ఓవర్ ఐదో బంతికి ఫిల్ సాల్ట్ ఇచ్చిన రిటర్న్ క్యాచ్‌ను సందీప్ శర్మ అందుకోలేకపోయాడు. సందీప్ శర్మ వేసిన 6వ ఓవర్‌లో ఫిల్ సాల్ట్ ఇచ్చిన క్యాచ్‌తో పాటు రనౌట్ అవకాశాన్ని యశస్వి జైస్వాల్ వృథా చేశాడు. దాంతో పవర్ ప్లేలో ఆర్‌సీబీ వికెట్ నష్టపోకుండా 65 పరుగులు చేసింది. పవర్ ప్లేలోనే ఆర్‌సీబీ బ్యాటర్లు ఇచ్చిన 4 అవకాశాలను రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు అందిపుచ్చుకోలేకపోయారు.
ఫిల్ సాల్ట్ విధ్వంసం..
హసరంగా బౌలింగ్‌లో బౌండరీ బాది ఫిల్ సాల్ట్ 28 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ మరుసటి ఓవర్‌లోనే ఫిల్ సాల్ట్‌ను కార్తీకేయ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చి తొలి వికెట్‌కు నమోదైన 92 పరుగుల భాగస్వామ్యానికి తెరదించాడు. క్రీజులోకి వచ్చిన పడిక్కల్ సాయంతో కోహ్లీ ఆచితూచి ఆడాడు. పిచ్ కండిషన్స్‌కు తగ్గట్లు బ్యాటింగ్ చేసిన కోహ్లీ.. హసరంగా బౌలింగ్‌లో సిక్స్ బాది 39 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్నాడు. పడిక్కల్ ఇచ్చిన క్యాచ్‌ను తీక్షణ నేలపాలు చేశాడు. ఈ అవకాశంతో చెలరేగిన అతను సందీప్ శర్మ బౌలింగ్‌లో బౌండరీ బాది ఆర్‌సీబీ విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.
జిడ్డు బ్యాటింగ్..
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్ తమ ఇన్నింగ్స్‌ను నెమ్మదిగా ప్రారంభించింది. పిచ్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉండటంతో రాజస్థాన్ ఓపెనర్లు సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్ ఆచితూచి ఆడారు. యశస్వి దూకుడుగా ఆడినా.. సంజూ తీవ్రంగా తడబడ్డాడు. దాంతో పవర్ ప్లేలో రాజస్థాన్ వికెట్ నష్టపోకుండా 45 పరుగులే చేసింది. పవర్ ప్లే ముగిసిన వెంటనే స్పిన్నర్ కృనాల్ పాండ్యాను రంగంలోకి దించిన రజత్ పటీదార్.. ఆశించిన ఫలితాన్ని రాబట్టాడు. సంజూ శాంసన్‌ను కృనాల్ స్టంపౌట్‌గా పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చిన రియాన్ పరాగ్‌తో కలిసి యశస్వి తన దూకుడు కొనసాగించాడు.
సుయాశ్ శర్మ వేసిన 10వ ఓవర్‌లో వరుస బంతుల్లో జైస్వాల్, రియాన్ పరాగ్ ఇచ్చిన క్యాచ్‌లను ఆర్‌సీబీ ఆటగాళ్లు నేలపాలు చేశారు. ఆర్‌సీబీ స్పిన్నర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో రాజస్థాన్ పరుగుల వేగం తగ్గింది. కృనాల్ పాండ్యా వేసిన 13వ ఓవర్ తొలి బంతిని సింగిల్ తీసిన జైస్వాల్ 35 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇదే ఓవర్ ఆఖరి బంతికి జైస్వాల్ కొట్టిన భారీ సిక్సర్‌ను బౌండరీ లైన్‌పై ఫిల్ సాల్ట్ అడ్డుకున్నాడు.
చెలరేగిన ధ్రువ్ జురెల్
సూపర్ మ్యాన్‌లా గాల్లోకి ఎగిరి బంతిని పట్టి గ్రౌండ్‌లోకి విసిరేసాడు. దాంతో సిక్సర్ కాస్త సింగిల్‌గా మారింది. రియాన్ పరాగ్(30)ను యశ్ దయాల్ ఔట్ చేయగా.. జైస్వాల్ ఇచ్చిన మరో కష్టతరమైన క్యాచ్‌ను లివింగ్ స్లోన్ వదిలేసాడు. జైస్వాల్‌ను హజెల్ వుడ్ ఎల్బీగా పెవిలియన్ చేర్చగా.. 11 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ధ్రువ్ జురెల్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను విరాట్ కోహ్లీ చేజార్చాడు. ఈ అవకాశంతో అతను చెలరేగాడు. భారీ షాట్లతో 35 పరుగులతో అజేయంగా నిలిచి జట్టుకు 173 పరుగుల పోరాడే లక్ష్యాన్ని అందించాడు.