RR vs RCB: కొంపముంచిన అశ్విన్.. చెలరేగిన కార్తీక్, షెబాజ్.. ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచిన బెంగళూరు!

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) మరో అద్భుత విజయాన్నందుకుంది. దినేశ్ కార్తీక్(23 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 43 నాటౌట్), షెబాజ్ అహ్మద్(26 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 45) విరోచితన బ్యాటింగ్‌తో ఆర్‌సీబీ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 169 పరుగులు చేసింది. జోస్ బట్లర్(47 బంతుల్లో 6 సిక్స్‌లతో 70 నాటౌట్) మరో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడగా.. హెట్‌మైర్(31 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 42 నాటౌట్), దేవదత్ పడిక్కల్(29 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 37) రాణించారు. ఆర్‌సీబీ బౌలర్లలో డేవిడ్ విల్లే, హసరంగా, హర్షల్ పటేల్ తలో వికెట్ తీసారు.
అనంతరం ఆర్‌సీబీ 19.1 ఓవర్లలో 6 వికెట్లకు 173 పరుగులు చేసింది. 87/5తో ఓటమి ఖాయమనుకున్న ఆర్‌సీబీని దినేశ్ కార్తీక్, షాబాజ్ అహ్మద్ సూపర్ బ్యాటింగ్‌తో 6వ వికెట్‌కు 67 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. రాజస్థాన్ బౌలర్లలో చాహల్, బౌల్ట్ రెండేసి వికెట్లు తీయగా.. నవ్‌దీప్ సైనీ ఓ వికెట్ పడగొట్టాడు.

శుభారంభం..
170 పరుగు లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీకీ ఓపెనర్లు ఫాఫ్ డుప్లెసిస్(20 బంతుల్లో 5 ఫోర్లతో 29), అనూజ్ రావత్(25 బంతుల్లో 4 ఫోర్లతో 26) శుభారంభం అందించారు. ఆరంభం నుంచే బౌండరీలు బాదడంతో ఆర్‌సీబీ పవర్‌ప్లేలో వికెట్ నష్టపోకుండా 48 పరుగులు చేసింది. పవర్ ప్లే ముగిసిన వెంటనే బంతిని అందుకున్న చాహల్.. ఈ ఓపెనింగ్ జోడీని విడదీసాడు. సూపర్ బాల్‌తో డుప్లెసిస్‌ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో తొలి వికెట్‌కు నమోదైన 55 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. నవ్‌దైప్ సైనీ వేసిన ఆ మరుసటి ఓవర్‌లోనే అనూజ్ రావత్ సైతం కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు.

దెబ్బకొట్టిన చాహల్....
యుజ్వేంద్ర చాహల్ వేసిన 9వ ఓవర్‌లో వరుస రెండు బంతుల్లో ఆర్‌సీబీ కీలక వికెట్లు కోల్పోయింది. లేని పరుగు కోసం ప్రయత్నించి విరాట్ కోహ్లీ(5) రనౌటవ్వగా.. ఆ మరుసటి బంతికే డేవిడ్ విల్లే(0) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 7 పరుగుల వ్యవధిలోనే మూడు కీలక వికెట్లు కోల్పోయిన ఆర్‌సీబీ పీకల్లోతు కష్టాల్లో కూరకుపోయింది. ఆ కొద్దిసేపటికే షెఫ్రెన్ రూథర్ ఫోర్డ్(5)ను ట్రెంట్ బౌల్ట్ పెవిలియన్ చేర్చడంతో ఆర్‌సీబీ కష్టాలు రెట్టింపు అయ్యాయి.

కొంపముంచిన అశ్విన్..
అయితే క్రీజులోకి వచ్చిన దినేశ్ కార్తీక్ తనదైన బ్యాటింగ్‌తో మ్యాచ్ గమనాన్నే మార్చేసాడు. రవిచంద్రన్ అశ్విన్ చేసిన తప్పిదం అతనికి కలిసొచ్చింది. అశ్విన్ వేసిన 14వ ఓవర్ మూడో బంతిని దినేశ్ కార్తీక్ బౌండరీ తరలించగా.. అది నో బాల్ అయ్యింది. ఆ మరుసటి బంతిని భారీ సిక్సర్ బాదిన దినేశ్ కార్తీక్.. మరో రెండు ఫోర్లతో 21 పరుగులు పిండుకొని ఆర్‌సీబీని రేసులోకి తెచ్చాడు. అతనికితోడు షాబాజ్ అహ్మద్ కూడా తోడవ్వడంతో ఆర్‌సీబీ స్కోర్ పరుగెత్తింది.

స్మార్ట్ బ్యాటింగ్..
చాహల్ వేసిన 17వ ఓవర్ ఓపిక పట్టిన ఈ జోడీ.. సింగిల్స్‌తో 4 పరుగులే చేసింది. ట్రెంట్ బౌల్ట్ వేసిన 18వ ఓవర్‌లో షాబాజ్ అహ్మద్ సిక్స్, ఫోర్ కొట్టి ఔటయ్యాడు. అయితే చేధించాల్సిన రన్ రేట్ తక్కువగా ఉండటంతో కార్తీక్.. హర్షల్ పటేల్ సాయంతో ఆ పని పూర్తి చేసాడు. ప్రసిధ్ కృష్ణ వేసిన 19వ ఓవర్‌లో దినేశ్ కార్తీక్ రెండు బౌండరీలు బాదగా.. ఆఖరి ఓవర్‌లో హర్షల్ పటేల్ భారీ సిక్సర్‌తో విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications