ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్‌సీబీ 173 పరుగుల లక్ష్యాన్నే నమోదు చేసింది. రవిచంద్రన్ అశ్విన్(2/19) ధాటికి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 172 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(24 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 33), రజత్ పటీదార్(22 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 34), మహిపాల్ లోమ్రోర్(17 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 32 నాటౌట్) రాణించారు.
రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో ఆవేశ్ ఖాన్(3/44) మూడు వికెట్లు పడగొట్టగా.. అశ్విన్ రెండు వికెట్లు తీసాడు. యుజ్వేంద్ర చాహల్, ఆవేశ్ ఖాన్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ తలో వికెట్ తీసారు. కీలక సమయంలో గ్లేన్ మ్యాక్స్‌వెల్(0) గోల్డెన్ డక్‌గా వెనుదిరగడం.. దినేశ్ కార్తీక్(11) దారుణంగా విఫలమవ్వడం ఆర్‌సీబీ కొంపముంచింది.

శుభారంభం దక్కినా..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్‌సీబీకి ఓపెనర్లు విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ శుభారంభం అందించారు. పిచ్‌కు తగ్గట్లు ఆచితూచి ఆడిన ఈ జోడీ.. లూజ్ బాల్స్‌ను బౌండరీకి తరలించారు. క్రీజులో సెట్ అయిన ఈ జోడీని ట్రెంట్ బౌల్ట్ విడదీసాడు. రోవ్‌మన్ పోవెల్ సూపర్ డైవ్ క్యాచ్ సాయంతో ఫాఫ్ డుప్లెసిస్(17) పెవిలియన్ చేర్చాడు. దాంతో పవర్ ప్లేలో ఆర్‌సీబీ వికెట్ నష్టానికి 50 పరుగులు చేసింది.
అనంతరం సంజూ శాంసన్.. చాహల్‌ను రంగంలోకి దింపగా.. భారీ సిక్సర్ బాదే ప్రయత్నంలో విరాట్ కోహ్లీ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన కామెరూన్ గ్రీన్ దూకుడుగా ఆడగా.. రజత్ పటీదార్ సైతం బ్యాట్‌కు పనిచెప్పాడు. అయితే రవిచంద్రన్ అశ్విన్ వరుస బంతుల్లో కామెరూన్ గ్రీన్(27)తో పాటు గ్లేన్ మ్యాక్స్‌వెల్(0)ను పెవిలియన్ చేర్చాడు.

విఫలమైన దినేశ్ కార్తీక్..
దాంతో ఆర్‌సీబీ పీకల్లోతు కష్టాల్లో పడింది. నిలకడగా బ్యాటింగ్ చేసిన రజత్ పటీదార్‌ను ఆవేశ్ ఖాన్ స్లోయర్ బాల్‌తో బోల్తా కొట్టించాడు. దాంతో 122 పరుగులకే ఆర్‌సీబీ 5 వికెట్లు కోల్పోయింది. క్రీజులోకి వచ్చిన దినేశ్ కార్తీక్.. తొలి బంతికే ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. రివ్యూ ద్వారా బచాయించాడు. కానీ అతను ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు.
మహిపాల్ లోమ్రోర్ బౌండరీలు బాదడంతో ఆర్‌సీబీ 160 పరుగుల మార్క్‌ను అందుకుంది. అయితే అతన్ని ఆవేశ్ ఖాన్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చిన కర్ణ్ శర్మ.. ఆఖరి ఓవర్‌లో బౌండరీ బాదగా.. స్వప్నిల్ సింగ్ ఓ సిక్సర్ కొట్టాడు. ఆఖరి బంతికి కర్ణ్ శర్మ క్యాచ్ ఔటవ్వడంతో ఆర్‌సీబీ 172 పరుగులకే పరిమితమైంది.