హైదరాబాద్: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో ఎదురైన ఓటమిపై రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. బుధవారం గువహతి వేదికగా ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో పంజాబ్ 5 పరుగుల తేడాతో రాజస్థాన్‌ను ఓడించిన విషయం తెలిసిందే. ఆఖరి బంతి వరకు ఇరు జట్లను విజయం ఊరించింది.
సామ్ కరణ్ అద్భుత బౌలింగ్‌తో ఓటమి నుంచి పంజాబ్ గట్టెక్కగా.. అనాలోచిత నిర్ణయాలతో రాజస్థాన్ రాయల్స్ గెలిచే మ్యాచ్‌లో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ ఫలితంపై సంజూ శాంసన్ గురువారం మధ్యాహ్నం ఓ ట్వీట్ చేశాడు. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్‌తో ఉన్న తన ఫొటోను కూడా జత చేశాడు.

ఈ ఫొటోకు తనదైన పంచ్‌లైన్‌తో ఓ క్యాప్షన్ ఇచ్చాడు. 'అన్నా.. ప్రతీసారి మన మధ్యే ఉత్కంఠరేపే మ్యాచ్‌లు ఎందుకు జరుగుతాయంటావు?'అని పేర్కొన్నాడు. ఈ క్యాప్షన్‌కు ఆ ఫొటో సరిగ్గా సరిపోవడంతో నెట్టింట వైరల్‌గా మారింది. 16 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ ఎప్పుడు తలపడ్డా హోరాహోరీ మ్యాచ్‌లు జరిగాయి.
సూపర్ ఓవర్ ద్వారా ఫలితం తేలిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఓ మ్యాచ్‌లో అయితే ఆఖరి ఓవర్‌లో రాహుల్ తెవాటియా వరుసగా ఐదు సిక్స్‌లు బాది పంజాబ్‌పై రాజస్థాన్ రాయల్స్‌కు విజయాన్నందించాడు. బుధవారం జరిగిన మ్యాచ్‌లోనూ రాజస్థాన్ తృటిలో విజయాన్ని చేజార్చుకుంది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 197 పరుగులు చేసింది. కెప్టెన్ శిఖర్ ధావన్(56 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 86 నాటౌట్ ) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగగా... యువ ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్(34 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 60) అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు.
రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో జాసన్ హోల్డర్ ఒక్కడే రెండు వికెట్లు తీయగా.. అశ్విన్, యుజ్వేంద్ర చాహల్ తలో వికెట్ తీసారు. అనంతరం రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 192 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది.
సంజూ శాంసన్(25 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 42), షిమ్రాన్ హెట్‌మైర్(18 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 36), ధృవ్ జురెల్(15 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 32 నాటౌట్) రాణించినా ఫలితం లేకపోయింది. పంజాబ్ బౌలర్లలో నాథన్ ఎల్లిస్ 4 వికెట్లు తీయగా.. అర్ష్‌దీప్ సింగ్ 2 వికెట్లు పడగొట్టాడు.