గువహతి: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్-పంజాబ్ కింగ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. మన్కడింగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన రవిచంద్రన్ అశ్విన్.. మరోసారి అలా ఔట్ చేసే ప్రయత్నం చేశాడు. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్‌కు ఓ ఝలక్ ఇచ్చాడు. బౌలింగ్ వేయకముందే పదే పదే నాన్‌స్ట్రైకర్‌గా క్రీజును ధాటుతున్న ధావన్‌కు అశ్విన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు.
రనౌట్ చేయకపోయినా.. ఒక్కసారిగా బౌలింగ్ చేయడం ఆపి కనుసైగలతో గట్టిగా హెచ్చరించాడు. అశ్విన్ చర్యతో అప్రమత్తమైన ధావన్ వెంటనే క్రీజులోకి రాగా.. టీవీ కెమెరాలన్నీ రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్‌ను చూపించాయి. దాంతో కామెంటేటర్లు నవ్వు ఆపుకోలేకపోయారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్ సందర్భంగా అశ్విన్ వేసిన 7వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే మన్కడింగ్, అశ్విన్, జోస్ బట్లర్‌లకు వీడదీయని బంధం ఉంది. 2019 సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌కు ఆడిన అశ్విన్.. రాజస్థాన్ రాయల్స్‌కు ఆడుతున్న జోస్ బట్లర్‌ను మన్కడింగ్ పద్దతిలో ఔట్ చేశాడు. క్రికెట్‌లో ఈ రూల్ ఉన్నా.. అప్పట్లో ఈ విధానాన్ని అనైతికంగా భావించేవారు. దాంతో జోస్ బట్లర్‌ను అశ్విన్ మన్కడింగ్ చేయడంపై అప్పట్లో తీవ్ర దుమారం రేగింది.
క్రికెట్ ప్రపంచం రెండుగా విడిపోయింది. ఎంసీసీ ఈ నిబంధనను నైతికంగా మారుస్తూ రనౌట్‌గా ప్రకటించినా.. ఇప్పటికీ దీన్ని అనైతికంగానే చూస్తున్నారు. మన్కడింగ్ ఎక్కడ జరిగినా.. అశ్విన్, జోస్ బట్లర్ పేరు వినిపిస్తూనే ఉంటుంది. గత సీజన్ నుంచి ఈ ఇద్దరూ రాజస్థాన్ రాయల్స్‌కే ఆడుతున్నారు.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్‌కు ఓపెనర్లు శుభారంభం అందించారు. ప్రభ్‌సిమ్రాన్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగగా.. శిఖర్ ధావన్ యాంకర్ రోల్ పోషించాడు. దాంతో పవర్ ప్లేలోనే పంజాబ్ వికెట్ నష్టపోకుండా 63 పరుగులు చేసింది. 44 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ప్రభ్ సిమ్రాన్ ఇచ్చిన క్యాచ్‌ను దేవదత్ పడిక్కల్ నేలపాలు.
ఈ అవకాశంతో చెలరేగిన ప్రభ్‌సిమ్రాన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతను ఔటైన తర్వాత క్రీజులోకి భానుక రాజపక్స(1) రాగా.. అతను గాయపడి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. దాంతో క్రీజులోకి జితేశ్ శర్మ రాగా.. ధావన్ ధాటిగా ఆడి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జితేశ్ శర్మ(27) ఔటైనా.. సికిందర్ రాజాతో ధావన్ జట్టుకు భారీ స్కోర్ అందించే ప్రయత్నం చేస్తున్నాడు.