ఐపీఎల్ 2024 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. సంచలన ప్రదర్శనతో ఆ జట్టు ఏడో విజయాన్ని నమోదు చేసింది. ముంబై ఇండియన్స్‌తో జైపూర్ వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన రాజస్థాన్ రాయల్స్ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 179 పరుగులు చేసింది. తెలుగు తేజం తిలక్ వర్మ(45 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 65) హాఫ్ సెంచరీతో రాణించగా.. యువ ప్లేయర్ నెహాల్ వదేరా(24 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 49) సత్తా చాటాడు.

రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో సందీప్ శర్మ 5 వికెట్లతో ముంబై ఇండియన్స్ పతనాన్ని శాసించగా.. ట్రెంట్ బౌల్ట్ రెండు వికెట్లు తీసాడు. అశ్విన్, చాహల్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన రాజస్థాన్ రాయల్స్ 18.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 183 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది.
యశస్వి జైస్వాల్(60 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్స్‌లతో 104 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగగా.. జోస్ బట్లర్(25 బంతుల్లో 6 ఫోర్లతో 35), సంజూ శాంసన్(28 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38 నాటౌట్) విలువైన పరుగులు చేశారు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో పియూష్ చావ్లాకు ఓ వికెట్ దక్కింది.
అదిరిపోయే ఆరంభం..
180 పరుగుల సాధారణ లక్ష్య చేధనకు దిగిన రాజస్థాన్ రాయల్స్‌కు ఓపెనర్లు యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. తొలి ఓవర్ నుంచే దూకుడుగా ఆడిన ఈ జోడీ వేగంగా పరుగులు రాబట్టింది. దాంతో పవర్ ప్లేలో రాజస్థాన్ రాయల్స్ వికెట్ నష్టపోకుండా 61 పరుగులు చేసింది.
పవర్ ప్లే ముగిసిన వెంటనే వర్షం రావడంతో అంపైర్లు ఆటను నిలిపేసారు. దాదాపు 45 నిమిషాల పాటు ఆటకు అంతరాయం కలిగింది. వర్షం ఆగిపోవడంతో అంపైర్లు ఆటను తిరిగి ప్రారంభించారు. ఓవర్లను కుదించకుండా ఆటను మొదలుపెట్టారు. పియూష్ ఛావ్లా బౌలింగ్‌లో జోస్ బట్లర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
యశస్వి శతకం..
దాంతో తొలి వికెట్‌కు నమోదైన 74 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి సంజూ శాంసన్ రాగా.. యశస్వి జైస్వాల్ 30 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం మరింత ధాటిగా ఆడిన యశస్వి జైస్వాల్ భారీ సిక్సర్లతో ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డాడు.
సంజూ శాంసన్ సైతం దూకుడుగా ఆడటంతో రాజస్థాన్ రాయల్స్ స్కోర్ బోర్డు పరుగెత్తింది. తిలక్ వర్మ బౌలింగ్‌లో యశస్వి జైస్వాల్ క్విక్ సింగిల్ తీసి 59 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం బౌండరీతో విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.