ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 180 పరుగుల లక్ష్యాన్ని నమోదు చేసింది. సందీప్ శర్మ(5/18) నిప్పులు చెరగడంతో ముంబై ఇండియన్స్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు.
స్టార్ బ్యాటర్లు విఫలమైన వేళ తెలుగు తేజం తిలక్ వర్మ(45 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 65) విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆదుకున్నాడు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 179 పరుగులు చేసింది. తిలక్ వర్మకు తోడుగా నెహాల్ వదేరా(24 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 49) రాణించాడు.

రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో సందీప్ శర్మ 5 వికెట్లతో ముంబై ఇండియన్స్ పతనాన్ని శాసించగా.. ట్రెంట్ బౌల్ట్ రెండు వికెట్లు తీసాడు. అశ్విన్, చాహల్ తలో వికెట్ పడగొట్టారు.
టాప్-3 విఫలం..
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ట్రెంట్ బౌల్ట్ వేసిన తొలి ఓవర్‌లోనే రోహిత్ శర్మ(6) కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. సందీప్ శర్మ వేసిన ఆ మరుసటి ఓవర్‌లోనే ఇషాన్ కిషన్(0) డకౌటయ్యాడు. తన మరుసటి ఓవర్‌లో సూర్యకుమార్ యాదవ్(10)ను కూడా సందీప్ శర్మ పెవిలియన్ చేర్చాడు. దాంతో ముంబై ఇండియన్స్ 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఈ పరిస్థితుల్లో తిలక్ వర్మ, మహమ్మద్ నబీ(23) ఆచితూచి ఆడారు. దాంతో పవర్ ప్లేలో ముంబై 3 వికెట్లకు 45 పరుగులు చేసింది. ఆ వెంటనే సంజూ శాంసన్ తన ట్రంప్ కార్డ్ యుజ్వేంద్ర చాహల్‌ను రంగంలోకి దింపగా.. అతను మహమ్మద్ నబీని రిటర్న్ క్యాచ్‌తో బోల్తా కొట్టించాడు. ఈ వికెట్‌తో ఐపీఎల్‌లో 200 వికెట్ల మైలురాయి అందుకున్నాడు. ఈ ఘనతను అందుకున్న తొలి బౌలర్‌గా చరిత్రకెక్కాడు.

100 పరుగులు జోడించి..
క్రీజులోకి వచ్చిన నెహాల్ వధేరాతో తిలక్ వర్మ చెలరేగాడు. ఈ ఇద్దరూ దూకుడుగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగెత్తించారు. ఈ క్రమంలో తిలక్ వర్మ 38 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు నెహాల్ వధేరా ఒక్క పరుగు దూరంలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దాంతో ఐదో వికెట్‌కు నమోదైన 100 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా(10) దారుణంగా విఫలవ్వగా.. భారీ షాట్ ఆడే ప్రయత్నంలో తిలక్ వర్మ కూడా వెనుదిరిగాడు. హార్దిక్‌ను ఆవేశ్ ఖాన్ ఔట్ చేయగా.. తిలక్ వర్మ, గెరాల్డ్ కోయిట్జీలను సందీప్ శర్మ పెవిలియన్ చేర్చి ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు. చివరి ఓవర్‌లో టీమ్ డేవిడ్‌తో పాటు మూడు వికెట్లు తీసి ముంబై పతనాన్ని శాసించాడు. దాంతో ముంబై 177 పరుగులకే పరిమితమైంది.