
రోహిత్ శర్మ మళ్లీ విఫలం..
159 పరుగుల సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్, స్టార్ ఓపెనర్, బర్త్ డే బాయ్ రోహిత్ శర్మ(2) మరోసారి దారుణంగా విఫలమయ్యాడు. రవిచంద్రన్ అశ్విన్ వేసిన మూడో ఓవర్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. రోహిత్ ఔటైనా.. మరోవైపు ఇషాన్ కిషన్(26) ధాటిగా ఆడాడు. 4 ఫోర్లు, సిక్స్‌తో వేగంగా పరుగులు చేశాడు. కానీ క్రీజులో సెట్ అయిన అతన్ని ట్రెంట్ బౌల్ట్ కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో ముంబై పవర్ ప్లేలో 2 వికెట్ల నష్టానికి 41 పరుగులు చేసింది.

సూర్య హాఫ్ సెంచరీ..
ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన యువ బ్యాటర్, తెలుగు తేజం తిలక్ వర్మతో కలిసి సూర్యకుమార్ యాదవ్ ఆచితూచి ఆడాడు. యుజ్వేంద్ర చాహల్ బౌలింగ్‌లో ఎల్బీ అయ్యే ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న సూర్య.. ఆ తర్వాత తన జోరు కనబర్చాడు. పరుగుతీసే క్రమంలో బొటనవేలికి గాయమైనా.. ఆ నొప్పిని పంటి బిగువనే భరిస్తూ సూపర్ బ్యాటింగ్ చేశాడు. అశ్విన్ వేసిన 14వ ఓవర్ చివరి బంతిని సిక్సర్‌గా బాదిన సూర్య.. 36 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ సీజన్‌లో అతనికి ఇది మూడో అర్థశతకం.

చాహల్ దెబ్బకొట్టినా..
అయితే చాహల్ వేసిన మరుసటి ఓవర్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన సూర్య లాంగాన్ బౌండరీ లైన్ వద్ద రియాన్ పరాగ్ చేతికి చిక్కాడు. దాంతో మూడో వికెట్‌కు నమోదైన 81 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ప్రసిధ్ కృష్ణ వేసిన మరుసటి ఓవర్‌లో తిలక్ వర్మ(35) కూడా ఔటవ్వడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. ఈ ఓవర్‌లో 2 పరుగులే రావడంతో ముంబై విజయానికి 24 బంతుల్లో 35 పరుగులు అవసరమయ్యాయి. చాహల్ వేసిన 17వ ఓవర్‌లో టీమ్ డేవిడ్ భారీ సిక్సర్‌తో 10 పరుగులు.. కుల్దీప్ సేన్ వేసిన 18వ ఓవర్‌లో రెండు బౌండరీలు బాది 13 పరుగులు పిండుకున్నాడు. ప్రసిధ్ కృష్ణ వేసిన 19వ ఓవర్‌లో 8 పరుగులు రావడంతో ఆఖరి ఓవర్‌లో ముంబై విజయానికి 4 పరుగులు అవసరమయ్యాయి. అయితే కుల్దీప్ సేన్ వేసిన తొలి బంతికే పొలార్డ్(10) క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. అయితే క్రీజులోకి వచ్చిన డానియల్ సామ్స్ భారీ సిక్సర్‌తో విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.


Click it and Unblock the Notifications
