
ముంబై: షిమ్రన్ హెట్‌మైర్(36 బంతుల్లో ఫోర్, 6 సిక్సర్లతో 59 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగడంతో రాజస్థాన్ రాయల్స్.. లక్నో సూపర్ జెయింట్స్ ముందు 167 పరుగుల పోరాడే లక్ష్యాన్ని ఉంచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 165 పరుగులు చేసింది. దేవదత్ పడిక్కల్(29 బంతుల్లో 4 ఫోర్లతో 29), రవిచంద్రన్ అశ్విన్(23 బంతుల్లో 2 సిక్స్‌లతో 28) రాణించారు. లక్నో బౌలర్లలో జాసన్ హోల్డర్, కృష్ణప్ప గౌతమ్ రెండేసి వికెట్లు తీసారు. ఆవేశ్ ఖాన్ ఓ వికెట్ పడగొట్టాడు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్‌కు ఓపెనర్లు జోస్ బట్లర్(13), దేవదత్ పడిక్కల్(29) శుభారంభం అందించారు. అయితే ఇన్నింగ్స్ 6వ ఓవర్‌లో జోస్ బట్లర్‌ను ఆవేశ్ ఖాన్ బౌల్డ్ చేయడంతో పవర్ ప్లేలో రాజస్థాన్ వికెట్ నష్టానికి 44 పరుగులు చేసింది. బౌండరీలతో టచ్‌లోకి వచ్చినట్లు కనిపించిన కెప్టెన్ సంజూ శాంసన్(13)ను హోల్డర్ వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. ఆ మరుసటి ఓవర్‌లోనే క్రీజులో కుదురుకున్న దేవదత్ పడిక్కల్‌ను కృష్ణప్ప గౌతమ్ ఔట్ చేశాడు.
జట్టులోకి వచ్చిన రాసీ వాన్ డెర్ డస్సన్(4) తీవ్రంగా నిరాశపరిచాడు. గౌతమ్ బౌలింగ్‌లోనే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ పరిస్థితుల్లో షిమ్రాన్ హెట్‌మైన్, రవిచంద్రన్ అశ్విన్(28) ఇన్నింగ్స్ చక్కదిద్దారు. హెట్‌మైర్ భారీ సిక్సర్లతో స్కోర్ బోర్డు పరుగెత్తించాడు. ఆవేశ్ ఖాన్ వేసిన 19వ ఓవర్‌లో అశ్విన్ రిటైర్ట్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత హెట్‌మైర్ రెండు భారీ సిక్సర్లు బాది 33 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివరి ఓవర్‌లో హెట్‌మైర్, పరాగ్ చెరొక సిక్స్ బాదడంతో రాజస్థాన్ గౌరవప్రదమైన స్కోర్ చేసింది.