ఐపీఎల్ 2026 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్(LSG) పరాజయాల పరంపర కొనసాగుతోంది. వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ ఆ జట్టు ఓటమిపాలైంది. బుధవారం లక్నో వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన లక్నో సూపర్ జెయింట్స్ 40 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. రవీంద్ర జడేజా(29 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 43 నాటౌట్) అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శనతో రాజస్థాన్ రాయల్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇన్నింగ్స్ చివర్లో అతను చేసిన విలువైన పరుగులు మ్యాచ్‌ను మలుపు తిప్పాయి.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 159 పరుగులే చేసింది. రవీంద్ర జడేజా(29 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 43 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలవగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లలో మహమ్మద్ షమీ(2/30), ప్రిన్స్ యాదవ్(2/29), మోహ్‌సిన్ ఖాన్(2/17) రెండేసి వికెట్లు తీసారు.

అనంతరం లక్నో సూపర్ జెయింట్స్ 18 ఓవర్లలో 119 పరుగులకే కుప్పకూలింది. మిచెల్ మార్ష్(41 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌తో 55) హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేయగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. మిచెల్ మార్ష్‌తో పాటు నికోలస్ పూరన్(22), హిమ్మత్ సింగ్(15) మినహా అందరూ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఆయుష్ బదోని(0), రిషభ్ పంత్(0), ఎయిడెన్ మార్క్‌రమ్(0) డకౌట్‌గా పెవిలియన్ చేరారు.
రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్(3/20) మూడు వికెట్లు తీయగా.. నండ్రే బర్గర్(2/27), బ్రిజేష్ శర్మ(2/18) రెండేసి వికెట్లు పడగొట్టారు. రవీంద్ర జడేజా, రవి బిష్ణోయ్‌లకు తలో వికెట్ దక్కింది.
110 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన రాజస్థాన్ రాయల్స్‌ను రవీంద్ర జడేజా ఆదుకున్నాడు. శుభమ్ దూబే(19 నాటౌట్) సాయంతో 49 పరుగులు జోడించాడు. దాంతో రాజస్థాన్ రాయల్స్ పోరాడే లక్ష్యాన్ని అందుకుంది. జడేజా కూడా విఫలమై ఉంటే రాజస్థాన్ రాయల్స్ 130 పరుగులు కూడా చేసి ఉండేది కాదు.
రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో నండ్రే బర్గర్ గేమ్ ఛేంజింగ్ స్పెల్ వేసాడు. లక్నో కెప్టెన్ రిషభ్ పంత్‌ను తన రెండో ఓవర్‌లోనే డకౌట్ చేసిన బర్గర్.. హాఫ్ సెంచరీతో క్రీజులో పాతుకుపోయిన మిచెల్ మార్ష్‌ను క్యాచ్ ఔట్ చేసి లక్నో పతనాన్ని శాసించాడు. మిచెల్ మార్ష్‌ను ఔట్ చేయకపోయి ఉంటే ఫలితం మరోలా ఉండేది. ముఖ్యంగా లక్నో బ్యాటర్లలో ముగ్గురు బ్యాటర్లు డకౌటవ్వడం ఆ జట్టు పతనాన్ని శాసించింది.