జైపూర్: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. రాజస్థాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 154 పరుగులు చేసింది.
కైల్ మేయర్స్(42 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 51) హాఫ్ సెంచరీతో రాణించగా.. కేఎల్ రాహుల్(32 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 39), నికోలస్ పూరన్(20 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 29) పర్వాలేదనిపించారు. కేఎల్ రాహుల్ జిడ్డు బ్యాటింగ్ లక్నో సూపర్ జెయింట్స్ కొంపముంచింది. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ రెండు వికెట్లు తీయగా.. ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, జాసన్ హోల్డర్ తలో వికెట్ తీసారు.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్‌ను ఓపెనర్లు కేఎల్ రాహుల్, కైల్ మేయర్స్ నిదానంగా ప్రారంభించారు. ట్రెంట్ బౌల్ట్ సూపర్ బౌలింగ్‌కు పూర్తిగా డిఫెన్స్‌కే పరిమితమయ్యారు. ఓపెనర్లు ఇద్దరూ జిడ్డు బ్యాటింగ్‌తో ఆచితూచి ఆడటంతో లక్నో పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 37 పరుగులు మాత్రమే చేసింది.
అనంతరం జూలు విధిల్చిన ఈ ఇద్దరూ ధాటిగా ఆడారు. హోల్డర్ బౌలింగ్‌లో మేయర్స్ సిక్స్, ఫోర్ బాదగా.. చాహల్ బౌలింగ్‌లో రాహుల్ రెండు సిక్స్‌లతో పాటు ఓ బౌండరీ బాదాడు. దాంతో 9 ఓవర్లలో లక్నో 74 పరుగులు చేసింది. అశ్విన్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయగా.. కేఎల్ రాహుల్‌ను హోల్డర్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చి తొలి వికెట్‌కు నమోదైన 82 పరుగుల భాగస్వామ్యానికి తెరదించాడు.

బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ అందుకున్న ఆయూష్ బదోని(1) ని ట్రెంట్ బౌల్ట్ క్లీన్ బౌల్డ్ చేయగా.. దీపక్ హుడా(2)ను అశ్విన్ పెవిలియన్ చేర్చాడు. 40 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న కైల్ మేయర్స్‌ను అశ్విన్ బౌల్డ్ చేశాడు. దాంతో 104 పరుగులకే లక్నో 4 వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన మార్కస్ స్టోయినిస్(21), నికోలస్ పూరన్(29) ధాటిగా ఆడటంతో లక్నో 150 పరుగుల మార్క్‌ను ధాటింది.