
ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ మరో అద్భుత విజయాన్నందుకుంది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ఆర్‌ఆర్ 7 పరుగుల తేడాతో గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 217 పరుగులు చేసింది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఇదే భారీ టార్గెట్. జోస్ బట్లర్(61 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్‌లతో 103) శతకానికి అండగా సంజూ శాంసన్(19 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38) షిమ్రన్ హెట్‌మైర్(13 బంతుల్లో 2ఫోర్లు, 2 సిక్సర్లతో 26 నాటౌట్) రాణించారు. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్ 2 వికెట్లు తీయగా..శివం మావి, ప్యాట్ కమిన్స్, ఆండ్రీ రస్సెల్ తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన కేకేఆర్ 19.4 ఓవర్లలో 210 పరుగులకు కుప్పకూలింది. శ్రేయస్ అయ్యర్(51 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 85), ఆరోన్ ఫించ్(28 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 58) హాఫ్ సెంచరీలతో రాణించినా ఫలితం లేకపోయింది. రాజస్థాన్ బౌలర్లలో చాహల్(5/40) హ్యాట్రిక్ వికెట్‌తో పాటు తొలిసారి ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు. మెక్‌కాయ్ రెండు వికెట్లు తీయగా.. ప్రసిధ్, అశ్విన్ తలో వికెట్ తీసారు.