
ముంబై: జోస్ బట్లర్(61 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్‌లతో 103) మరో శతకంతో చెలరేగడంతో రాజస్థాన్ రాయల్స్.. కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) ముందు 218 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 217 పరుగులు చేసింది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఇదే భారీ టార్గెట్. జోస్ బట్లర్ శతకానికి అండగా సంజూ శాంసన్(19 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38) షిమ్రన్ హెట్‌మైర్(13 బంతుల్లో 2ఫోర్లు, 2 సిక్సర్లతో 26 నాటౌట్) రాణించారు. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్ 2 వికెట్లు తీయగా..శివం మావి, ప్యాట్ కమిన్స్, ఆండ్రీ రస్సెల్ తలో వికెట్ తీసారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్‌కు ఓపెనర్లు జోస్ బట్లర్, దేవదత్ పడిక్కల్(24) శుభారంభాన్ని అందించారు. ఆరంభం నుంచి బౌలర్లపై ఈ జోడీ విరుచుకుపడటంతో పవర్ ప్లేలోనే రాజస్థాన్ వికెట్ నష్టపోకుండా 60 పరుగులు చేసింది. కమిన్స్ వేసిన 7వ ఓవర్‌లో బౌండరీ బాదిన బట్లర్.. 29 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక క్రీజులో కుదురుకొని ప్రమాదకరంగా మారిన ఈ జోడీని సునీల్ నరైన్ విడదీసాడు. దేవదత్ పడిక్కల్‌ను క్లీన్ బౌల్డ్ చేయడంతో తొలి వికెట్‌కు నమోదైన 97 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సంజూ శాంసన్‌తో బట్లర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అతనికి సంజూ హిట్టింగ్ కూడా తోడవడంతో రాజస్థాన్ స్కోర్ బోర్డు పరుగెత్తింది. సంజూ శాంసన్‌ను రస్సెల్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చగా.. కమిన్స్ వేసిన ఆ మరుసటి ఓవర్‌లో భారీ సిక్సర్‌తో బట్లర్ 59 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ సీజన్‌లో అతనికిది రెండో శతకం కావడం విశేషం. ఆ వెంటనే బట్లర్ ఔటవ్వగా... క్రీజులోకి వచ్చిన రియాన్ పరాగ్(5), కరుణ్ నాయర్(3) తీవ్రంగా నిరాశపరిచారు. చివరి ఓవర్‌లో హెట్‌మైర్ రెండు భారీ సిక్సర్లతో పాటు బౌండరీ బాది జట్టు స్కోర్‌ను 217కు చేర్చాడు.