ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్ బౌలర్లు సమష్టిగా చెలరేగారు. పిచ్ నుంచి లభించిన సహకారాన్ని అందిపుచ్చుకున్నారు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 151 పరుగులు చేసింది. ధ్రువ్ జురెల్(28 బంతుల్లో 5 ఫోర్లతో 33), యశస్వి జైస్వాల్(24 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 29) టాప్ స్కోరర్లుగా నిలిచారు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తీ(2/17), మోయిన్ అలీ(2/23), హర్షిత్ రాణా(2/36), వైభవ్ అరోరా(2/33) రెండేసి వికెట్లు తీయగా.. స్పెన్సర్ జాన్సన్ ఓ వికెట్ పడగొట్టాడు.
నిరాశపర్చిన సంజూ..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్‌కు ఆశించిన ఆరంభం దక్కలేదు. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్ దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించినా.. ఎక్కువ సేపు క్రీజులో ఉండలేకపోయారు. దూకుడుగా ఆడిన ఈ జోడీని వైభవ్ అరోరా విడదీసాడు. కెప్టెన్ సంజూ శాంసన్(8)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో తొలి వికెట్‌కు నమోదైన 33 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి రియాన్ పరాగ్ రాగా..యశస్వి జైస్వాల్ భారీ షాట్లతో చెలరేగాడు. అతను ఇచ్చిన రిటర్న్ క్యాచ్‌ను హర్షిత్ రాణా నేలపాలు చేశాడు. రియాన్ పరాగ్ కూడా భారీ సిక్సర్ బాదడంతో పవర్ ప్లేలో రాజస్థాన్ రాయల్స్ వికెట్ నష్టానికి 54 పరుగులు చేసింది.

హెల్మెట్ తీసి క్యాచ్ పట్టాడు..
పవర్ ప్లే అనంతరం రహానే.. స్పిన్నర్లను రంగంలోకి దింపగా.. రాజస్థాన్ పరుగుల వేగం తగ్గింది. వరుణ్ చక్రవర్తీ బౌలింగ్‌లో భారీ సిక్సర్ బాదిన రియాన్ పరాగ్.. అదే ఓవర్‌లో భారీ షాట్ ఆడబోయి క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేరాడు. గాల్లోకి వెల్లిన ఈ బంతిని వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ హెల్మెట్ తీసి పట్టడం గమనార్హం. ఆ మరుసటి ఓవర్‌లో జైస్వాల్‌ను మోయిన్ అలీ ఔట్ చేయగా.. హసరంగా(4)ను వరుణ్ చక్రవర్తీ పెవిలియన్ చేర్చాడు. నితీష్ రాణా(8) మరోసారి దారుణంగా విఫలమయ్యాడు. మోయిన్ అలీ(8) బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
పోరాడిన ధ్రువ్ జురెల్
శుభమ్ దూబేతో కలిసి ధ్రువ్ జురెల్ పోరాడాడు. కానీ శుభమ్ దూబే(9)ను వైభవ్ అరోరా పెవిలియన్ చేర్చాడు. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడంతో రాజస్థాన్ రాయల్స్ పరుగుల వేగం తగ్గింది. ఆడపా దడపా ధ్రువ్ జురెల్ బౌండరీలు బాదాడు. షిమ్రాన్ హెట్‌మైర్ ఇచ్చిన క్యాచ్‌ను బౌండరీ లైన్ వద్ద వెంకటేశ్ అయ్యర్ నేలపాలు చేశాడు. మరోవైపు హాఫ్ సెంచరీ దిశగా సాగిన ధ్రువ్ జురెల్‌ను హర్షిత్ రాణా క్లీన్ బౌల్డ్ చేశాడు. క్రీజులోకి వచ్చిన జోఫ్రా ఆర్చర్ ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్‌గా తరలించాడు. మరోవైపు హెట్‌మైర్(7) భారీ షాట్ ఆబోయి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఆఖరి ఓవర్‌లో ఆర్చర్ ఓ సిక్సర్ బాది క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆఖరి బంతికి తుషార్ దేశ్ పాండే రెండు పరుగులు తీసి జట్టు స్కోర్‌ను 151 పరుగులకు చేర్చాడు.