బ్యాటింగ్ వైఫల్యమే తమ ఓటమిని శాసించిందని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ అన్నాడు. అదనంగా 20 పరుగులు చేయాల్సిందని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో గౌహతి వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 8 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన రియాన్ పరాగ్.. ప్రణాళికలను అమలు చేయలేకపోయామని చెప్పాడు. క్వింటన్ డికాక్ అసాధారణ బ్యాటింగ్‌తో తమ విజయవకాశాలను దెబ్బ తీసాడన్నాడు.
'ఈ వికెట్‌పై 170 పరుగులు మంచి స్కోర్. మేం 170 పరుగుల లక్ష్యంగా బ్యాటింగ్ చేశాం. ఈ వికెట్ గురించి తెలిసే నేను దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాను. కానీ మేం 20 పరుగులు తక్కువగా చేశాం. బౌలింగ్‌లో క్వింటన్ డికాక్‌ను త్వరగా ఔట్ చేయాలనేది మా ప్లాన్. కానీ అది జరగలేదు. దాంతో మేం మిడిల్ ఓవర్లలో అతన్ని ఔట్ చేయాలని ప్రయత్నించాం. కానీ అతను అసాధారణ బ్యాటింగ్‌తో విజయాన్ని లాగేసుకున్నాడు. అతనికి హ్యాట్సాఫ్. నేను నెంబర్ 3లో బ్యాటింగ్ చేయడం సంతోషంగా ఉంది. గతేడాది నేను నాలుగో స్థానంలో ఆడాను. చాలా సంతోషంగా ఆ బాధ్యతను నిర్వర్తించాను.

ఈ ఏడాది మా టీమ్‌మేనేజ్‌మెంట్ మూడో స్థానంలో ఆడాలని చెప్పింది. కాబట్టి జట్టు కోరుకున్న స్థానంలో బ్యాటింగ్ చేసేందుకు నేను ప్రోఫెషనల్‌గా సిద్దంగా ఉండాలి. ఈ విషయంలో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. గతేడాదితో పోలిస్తే.. ఈ సారి మా జట్టు చాలా యంగ్‌గా ఉంది. సమష్టిగా రాణించాల్సిన అవసరం ఉంది. మేం మెరుగైన ప్రదర్శన చేస్తున్నా.. సమష్టిగా రాణించడంలో విఫలమవుతున్నాం. మేం కలిసి కట్టుగా రాణిస్తే ఫలితాలు మాకు అనుకూలంగా వస్తాయి. మేం తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకుంటాం. మళ్లీ రిపీట్ కాకుండా చూసుకుంటాం. ఫ్రెష్ మైండ్‌సెట్‌తో చెన్నైలో అడుగుపెడుతాం.'అని రియాన్ పరాగ్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 151 పరుగులు చేసింది. ధ్రువ్ జురెల్(28 బంతుల్లో 5 ఫోర్లతో 33), యశస్వి జైస్వాల్(24 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 29) టాప్ స్కోరర్లుగా నిలిచారు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తీ(2/17), మోయిన్ అలీ(2/23), హర్షిత్ రాణా(2/36), వైభవ్ అరోరా(2/33) రెండేసి వికెట్లు తీయగా.. స్పెన్సర్ జాన్సన్ ఓ వికెట్ పడగొట్టాడు. అనంతరం కేకేఆర్ 17.3 ఓవర్లలో 2 వికెట్లకు 153 పరగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. క్వింటన్ డికాక్(61 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లతో 97 నాటౌట్) , అంగ్‌క్రిష్ రఘువంశీ(17 బంతుల్లో 2 ఫోర్లతో 22 నాటౌట్) రాణించారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో వానిందు హసరంగా ఒక్కడే వికెట్ తీసాడు.